వికారాబాద్: జిల్లా రైతుల నుంచి సేకరించిన సన్న వడ్లకు సంబంధించి బోనస్ డబ్బులు ఇప్పటికీ చెల్లించలేదు. గత రెండు సీజన్లలో మద్దతు ధరకు సన్న, దొడ్డు రకాల ధాన్యాన్ని కొనుగోలు చేసిన ప్రభుత్వం వెంటవెంటనే డబ్బులు చెల్లించింది. కానీ, సన్న వడ్లకు ఇస్తామన్న రూ.500 బోనస్ పెండింగ్‌లో పెట్టింది. ఈ డబ్బుల కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
అంచనాలకు మించి
గత మూడు సీజన్లతో పోలిస్తే 2025 రబీ సీజన్‌లో భారీగా ధాన్యం కొనుగోలు చేశారు. 92 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా, రెండు లక్షల మెట్రిక్ దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇందులో 90 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, అంచనాలకు మించి లక్ష మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం సేకరించారు. వీటితో పాటు 3,900 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యానిసేకరించారు. ఇందుకు గానూ క్వింటాలుకు రూ.500 చొప్పున రైతులకు రూ.1.95 కోట్ల బోనస్ డబ్బులు చెల్లించాల్సి ఉండగా, ఇప్పటికీ ఖాతాల్లో జమకాలేదు. 2026 యాసంగి సీజన్‌కు సంబంధించి మొత్తం 90 వేల ఎకరాల్లో వరి సాగు చేయగా 1.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. వీటితో పాటు 8,421 మెట్రిక్ టన్నుల సన్నరకం వడ్లను సేకరించింది. ఇందుకు సంబంధించిన బోనస్ రూ.4.46 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉన్నా, ఇప్పటికీ ఎదురు చూపులు తప్పడం లేదు.
ప్రైవేటు వైపు రైతన్న చూపు
జిల్లాలో సాధారణ వరి సాగు విస్తీర్ణం 93 వేల ఎకరాలు కాగా, గత మూడు సీజన్లుగా అంతకు మించి నమోదైంది. గత వానాకాలం సీజన్‌లో 1.30 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా, యాసంగిలో 90 వేలకుపైగా ఎకరాల్లో సాగైంది. ఇందులో అత్యధికంగా పరిగి వ్యవసాయ డివిజన్‌లో 46,876 ఎకరాలు, కొడంగల్ డివిజన్‌లో 45,137, తాండూరు 29,964, వికారాబాద్ డివిజన్‌లో 8,023 ఎకరాల్లో వరి సాగైంది. జిల్లాలో మొత్తం 20 మండలాలు ఉండగా ఇందులో 12 మండలాల్లో వెయ్యి నుంచి ఐదు వేల ఎకరాల్లో వరి సాగు నమోదైంది. 2023 మరియు 2024 సీజన్లతో పోలిస్తే 2025 యాసంగిలో సన్నరకం వడ్ల సాగు విస్తీర్ణం గననీయంగా పెరిగింది. రెండు మూడు వేల ఎకరాలు దాటని సన్నరకం సాగు 2025 యాసంగిలో 14 వేల ఎకరాల్లో సాగైంది. 8,421 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యాన్ని రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. బోనస్ డబ్బులు చెల్లించకపోవడంతో 2026 యాసంగి సీజన్‌లో కేవలం 3,900 మెట్రిక్ టన్నులు మాత్రమే ప్రభుత్వానికి అమ్మారు. మిగిలినవారు ప్రైవేటు వ్యాపారులకు విక్రయించారు.
ఇప్పటికీ దిగుమతే..
జిల్లాలోని ప్రైవేటు వ్యాపారులు కర్నూలుతో పాటు తెలంగాణలోని మిర్యాలగూడ ప్రాంతంలో పండించిన సన్నరకం బియ్యాన్ని దిగుమతి చేసుకుంటున్నారు. ఈ తరుణంలో సన్నవడ్ల సాగు పెరగడం శుభపరిణామంగా కనిపించింది. అయితే, బోనస్ చెల్లించే విషయంలో ప్రభుత్వం చేస్తున్న జాప్యం ప్రభావం గత సీజన్‌తో పాటు ప్రస్తుత సీజన్‌పై కూ డా పడనుంది. ప్రభుత్వం ఇప్పటికై నా బోనస్ డబ్బు లు చెల్లిస్తే కొనుగోలు కేంద్రాల్లో విక్రయించే అవకాశం ఉంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం ధరలు ఆకాశన్నంటడంతో సాధ్యమైనంత త్వరగా బకాయిలు విడుదల చేయాలి. లేదంటే ఈసారి కూడా ప్రైవేటుకే మొగ్గు చూపే ఛాన్స్ ఉంది.
దోమ మండలం బొంపల్లి గ్రామానికి చెందిన రైతు జంగయ్య ప్రభుత్వానికి సన్న రకం వడ్లు విక్రయించారు. ఏడాదిగా ఎదురు చూస్తున్నా బోనస్ అందడం లేదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే బోనస్‌కు ఆశపడి సన్నరకం ధాన్యం పండించినా ఫలితం లేకుండాపోతోందని ఆవేదన వ్యక్తంచేశారు.
బొంపల్లితండాకు చెందిన మాన్యనాయక్ సైతం గత రెండు సీజన్లలో సన్న రకం వడ్లు పండించి కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. ప్రభుత్వం స్పందించి వెంటనే బోనస్ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రోత్సాహక నగదు చెల్లింపులో తీవ్ర జాప్యం
రెండు సీజన్లుగా అందని బకాయిలు
క్వింటాలుకు రూ.500 చొప్పున రూ.6.41 కోట్లు పెండింగ్


