● అంగన్‌వాడీ టీచర్,
ఆయా పోస్టులకు పోటాపోటీ
● మెరిట్, స్థానికతకు
ప్రాధాన్యమంటున్న అధికారులు
548 దరఖాస్తులు
తాండూరు రూరల్: అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి విశేష స్పందన లభించింది. తాండూరు క్లస్టర్ పరిధిలోని నాలుగు మండలాలు, ఓ మున్సిపాల్టీలో అంగన్‌వాడీ టీచర్, ఆయా పోస్టులకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో టీచర్ పోస్టులు 23, ఆయా పోస్టులు 28 ఉన్నాయి. ఈనెల 10నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించగా, 24తో గడువు ముగిసింది. టీచర్ పోస్టులతో పాటు ఆయా పోస్టులను కూడా స్థానికంగా ఉండేవారికే ప్రాధాన్యం ఇస్తామని ఐసీడీఎస్ అధికారులు చెబుతున్నారు.
దరఖాస్తులు ఇలా..
తాండూరు ఐసీడీఎస్ క్లస్టర్ పరిధిలో తాండూరు, పెద్దేముల్, యాలాల, బషీరాబాద్ మండలాలతో పాటు తాండూరు మున్సిపాలిటీ ఉంది. వీటి పరిధిలో ఖాళీగా ఉన్న 23 టీచర్ పోస్టులకు 548 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో తాండూరు మున్సిపాల్టీలోని 6 టీచర్ పోస్టులకు 367 అప్లికేషన్లు రావడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. 28 ఆయా పోస్టులకు 65 దరఖాస్తులు వచ్చాయి.
తాండూరు మండలంలో..
తాండూరు మండలంలోని ఓగిపూర్ అంగన్‌వాడీ టీచర్ పోస్టుకు 1 దరఖాస్తు, సంగెంకలాన్– 6, సంకిరెడ్డిపల్లితండా– 6 దరఖాస్తులు వచ్చాయి. యాలాల మండలం నాగసముందర్ అంగన్‌వాడీ టీచర్ పోస్టుకు– 3, అగ్గనూర్– 27, అక్కంపల్లి– 14, మల్‌రెడ్డిపల్లి– 13, కోకట్– 18, తుప్పెర్లగడ్డతండా– 9 దరఖాస్తులు అందాయి. బషీరాబాద్ మండలంలోని కొర్విచెడ్‌లో– 11, బద్లాపూర్‌తండా– 13, జీవన్గి గ్రామంలోని మూడు టీచర్ పోస్టులకు– 23 దరఖాస్తులు వచ్చాయి. పెద్దేముల్ మండలంలోని కొండాపూర్‌లో టీచర్ పోస్టుకు– 9, ఉషానాయక్‌తండా–15, నెల్లిగడ్డతండా– 13 అప్లికేషన్లు అందాయి.
తాండూరు మున్సిపాల్టీలో..
తాండూరు ఐసీడీఎస్ క్లస్టర్ పరిధిలోని తాండూరు మున్సిపాల్టీలో 6 అంగన్‌వాడీ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికోసం ఏకంగా 367 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో వడ్డెరగల్లి– 64, గడి– 60, గుమస్తానగర్– 118, పుటన్‌గల్లి– 62, రాజీవ్ గృహకల్ప– 31, మాణిక్‌నగర్– 32 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
28 ఆయా పోస్టులకు 65 అప్లికేషన్లు
తాండూరు ఐసీడీఎస్ క్లస్టర్ పరిధిలోని పలు అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 28 ఆయా పోస్టులకు గాను 65 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. గిరిజన తండాల్లోని సెంటర్లలో ఉన్న ఆయా పోస్టులను మాత్రమే భర్తీ చేస్తున్నారు.
పైరవీలకు తావులేదు
తాండూరు ఐసీడీఎస్ క్లస్టర్ పరిధిలోని టీచర్, ఆయా పోస్టుల ఎంపిక విషయంలో ఎలాంటి పైరవీలకు తావు లేదు. అభ్యర్థుల స్థానికతతో పాటు మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తాం. క్షేత్రస్థాయిలో అడిషనల్ సీడీపీఓతో పాటు సూపర్‌వైజర్ వెళ్లి దరఖాస్తులను క్షుణంగా పరిశీలిస్తారు. అనంతరం అప్లికేషన్లను కలెక్టర్‌కు పంపిస్తాం. ఎంపిక అంశం కలెక్టర్ పరిధిలోనే ఉంటుంది.
– కాంతారావు, సీడీపీఓ, తాండూరు క్లస్టర్


