కలిసికట్టుగా ఎదుర్కోవాలి | - | Sakshi
Sakshi News home page

కలిసికట్టుగా ఎదుర్కోవాలి

Oct 27 2026 8:22 AM | Updated on Oct 27 2026 8:22 AM

ప్రణాళిక సిద్ధం

వికారాబాద్‌: ప్రభుత్వ శాఖలు, ప్రజలు కలిసికట్టుగా ఎల్‌నినోను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్‌ అన్నారు. వికారాబాద్‌ కలెక్టరేట్‌లో సోమవారం కలెక్టర్‌ దీపక్‌ తివారితో కలిసి జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఎల్‌నినో ప్రభావం ఎలా ఉంది..? శాఖల వారీగా తీసుకుంటున్న చర్యలు ఏమిటి..? ఎన్ని గ్రామ పంచాయతీలు, ఎన్ని ఆవాసాలు, ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు చేపడుతున్న సంసిద్ధతా కార్యక్రమాలపై చర్చించారు. జిల్లాలో ఎన్ని చెరువులు ఉన్నాయి..? వీటి నీటి నిల్వ సామర్థ్యం ఎంత.. ప్రస్తుతం ఎంతశాతం నీరు నిల్వ ఉంది..? తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. వీబీజీరామ్‌జీ పథకంలో కల్పిస్తున్న పనులు, వస్తున్న కూలీలు, జిల్లాకు అనుగుణంగా చేస్తున్న ప్రణాళికలు తదితర అంశాలపై క్షుణ్ణంగా సమీక్షించారు. అర్హత కలిగిన ప్రతీ కుటుంబానికి అడిగిన వెంటనే పనులు కల్పించాలని డీఆర్డీఏ అధికారులను ఆదేశించారు. ఎల్‌నినోను దృష్టిలో ఉంచుకుని పనులు ప్లాన్‌ చేసుకోవాలన్నారు. పశుపోషణ విషయంలో తీసుకుంటున్న చర్యలను తెలుసుకున్నారు. గ్రాసం కొరత రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పంటల సాగు విధానం మారేలా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులకు సూచించారు. నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. నీటిని పొదుపుగా వాడేలా చూడాలని తెలిపారు. తక్కువ నీటితో పండే స్వల్పకాలిక పంటలు సాగు చేసేలా అవగాహన కల్పించాలన్నారు.

ఎల్‌నినో ప్రణాళిక తప్పనిసరి

అడిగిన ప్రతిఒక్కరికీ పని కల్పించాలి

నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి

ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్‌

వికారాబాద్‌లో జిల్లా స్థాయి అధికారుల సమీక్ష

కలెక్టర్‌ దీపక్‌ తివారి మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో జిల్లాలో తీసుకుంటున్న చర్యలను వివరించారు. వీబీజీరామ్‌జీలో నీటి నిల్వకు అవసరమైన పనులు చేపట్టేలా ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. నేలపై రాలిన ప్రతీ నీటి చుక్క లోనికి ఇంకేలా గుంతలు తవ్విస్తున్నామని స్పష్టంచేశారు. సాగు పద్ధతులపై ఎప్పటికప్పుడు రైతులకు సూచనలు చేస్తున్నామన్నారు. అనంతరం మండల పరిధిలోని పీలారం గ్రామాన్ని సందర్శించి బీవీజీరామ్‌జీ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్లు వెంకటాచారి, ఉమాశంకర్‌ప్రసాద్‌, అడిషనల్‌ కమిషనర్లు రవిందర్‌, శ్రీనివాస్‌, జెడ్పీ సీఈఓ సుధీర్‌, డీఆర్డీఓ శ్రీనివాస్‌, డీపీఓ జయసుధ, డీఏఓ కవిత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement