వ్యర్థాలకు నిప్పు.. స్థానికులకు ముప్పు | - | Sakshi
Sakshi News home page

వ్యర్థాలకు నిప్పు.. స్థానికులకు ముప్పు

Oct 27 2026 8:22 AM | Updated on Oct 27 2026 8:22 AM

కొత్తూరు: పట్టణంలో ఉన్న ఓ పైపుల పరిశ్రమ నుంచి సోమవారం పెద్ద ఎత్తున మంటలు, నల్లటి పొగ వెలువడ్డాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కొందరు మంటల సమీపంలోకి వెళ్లి పరిశీలించారు. వ్యర్థాలకు నిప్పు అంటుకోవడంతో మంటలు, పొగ వ్యాపించినట్లు గుర్తించారు. ఇళ్లకు సమీపంలో ఉన్న పరిశ్రమల్లో ఇలాంటి వాటితో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత శాఖల అధికారులు స్పందించాలని కోరారు.

అత్తారింటికి వచ్చి తిరిగి వెళ్తూ ..

● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

● బాలుడికి తీవ్ర గాయాలు

జడ్చర్ల: అత్తగారి ఊరిలో గృహప్రవేశ విందుకు హాజరై తిరిగి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా, మరో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన జడ్చర్ల మండలం చిన్న ఆదిరాల గ్రామ సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. ఆమనగల్లు మండలానికి చెందిన దేవ (38) తన అత్తగారి ఊరైన తుపుడుగడ్డతండాలో బంధువుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ విందుకు హాజరయ్యాడు. అనంతరం మోటార్‌బైక్‌పై తిరిగి వెళ్తుండగా చిన్న ఆదిరాల సమీపంలో బొలెరో వాహనం ఢీకొట్టింది. దీంతో దేవ అక్కడికక్కడే మృతిచెందాడు. బైక్‌పై వెనుక కూర్చున్న తుపుడుగడ్డతండాకు చెందిన శివ (15) తీవ్రంగా గాయపడటంతో చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు హైదరాబాద్‌లో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భార్య మౌనిక, కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం భార్య గర్భిణి అని బంధువులు తెలిపారు. దేవ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జడ్చర్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

దాడి కేసులో ముగ్గురికి రిమాండ్‌

షాబాద్‌: సెల్‌ఫోన్‌ విషయమై జరిగిన గొడవలో భాగంగా ఓ వ్యక్తిని చితకబాదిన ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన షాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ లక్ష్మిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రేగడిదోస్వాడ గ్రామానికి చెందిన శ్రీనివాస్‌రెడ్డికి అతని వద్ద డ్రైవర్‌గా ఉండే ఖలీల్‌కు ఈనెల 22న సెల్‌ఫోన్‌ విషయమై గొడవ జరిగింది. ఖలీల్‌ తన బావమరుదులు అయిన ఆదిల్‌, అద్నాన్‌తో కలిసి కర్రలతో దాడి చేసి శ్రీనివాస్‌రెడ్డిని గాయపరిచారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని సోమవారం కోర్టులో హాజరు పర్చారు. అనంతరం నిందితులను రిమాండ్‌కు తరలించారు.

అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతి

శ్రీనగర్‌కాలనీ: అనుమానాస్పదస్థితిలో ఓ యువకుడు మృతిచెందిన ఘటన మధురానగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..విజయవాడకు చెందిన రమేష్‌ గుప్తా(35) ఆదిలాబాద్‌కు చెందిన ఇద్దరు, నర్సరావుపేటకు చెందిన యువకుడితో కలిసి సినీ కార్మికుడిగా పనిచేస్తూ యూసుఫ్‌గూడ ఎల్‌ఎన్‌నగర్‌లో నివాసముంటున్నాడు. సోమవారం పెంట్‌హౌస్‌ నుంచి దుర్వాసన రావడంతో ఓనర్‌ మధురానగర్‌ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తలుపు తెరిచిచూసే సరికి రమేష్‌ మృతదేహం కుళ్లిపోయి కనిపించింది. రమేష్‌ స్నేహితులు ముగ్గురూ కొన్ని రోజులుగా కనిపించకుండా పరారీలో ఉన్నారు. హత్య చేసి పారిపోయారా లేక ఆత్మహత్య చేసుకున్నాడా అనే అంశాలపై క్లూస్‌టీంతో విచారణ చేపడుతున్నారు. ఘటనా స్థలాన్ని జూబ్లీహిల్స్‌ జోన్‌ డీసీపీ రమణారెడ్డి, ఏసీపీ వెంకటరెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ ప్రభాకర్‌ పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement