● బెంగాల్‌కు చెందిన తల్లీకూతుళ్ల అరెస్టు
● 70 గ్రాముల బంగారం,
రూ.10 వేలు స్వాధీనం
సికింద్రాబాద్: భర్త ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం నగరానికి వచ్చి చోరీల బాట పట్టిన తల్లీకూతుళ్లు కటకటాలపాలయ్యారు. ఈ ఇద్దరినీ సోమవారం సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి 70 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. జీఆర్‌పీ డీఎస్‌పీ ఎస్.ఎన్. జావెద్ తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం బార్ధమాన్ జిల్లాకు చెందిన జమునా బైద్య (38), మాలతి బైద్య (20)లు తల్లీకూతుళ్లు. జమునా బైద్య భర్తకు వైద్యం చేయించేందుకు తన కుమార్తె మాలతి, మనవడితో కలిసి నగరానికి వచ్చింది. గచ్చిబౌలిలో అద్దెకు గది తీసుకుని ఏఐజీ ఆసుపత్రిలో భర్తకు చికిత్స చేయిస్తున్నారు. వైద్యం కోసం డబ్బు అవసరం కావడంతో, పాత నేరస్తులైన వీరు తిరిగి చోరీలకు పాల్పడాలని నిర్ణయించుకున్నారు.సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను వేదికగా చేసుకున్న ఈ తల్లీకూతుళ్లు, ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న రైళ్లలోకి ఎక్కే మహిళలను లక్ష్యంగా చేసుకునేవారు. ఒకరు హ్యాండ్ బ్యాగుల్లోని విలువైన వస్తువులు, డబ్బు దొంగిలిస్తుండగా, మరొకరు ప్రయాణికుల కదలికలను గమనిస్తూ సహకరించేవారని పోలీసులు తెలిపారు. రైల్వేస్టేషన్‌లో అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులకు పట్టుబడ్డ వీరిని అదుపులోకి తీసుకుని విచారించారు. గతంలో బెంగాల్ రాష్ట్రంలోనూ పలు నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లొచ్చినట్లు తెలిసింది. నిందితులను అదుపులోకి తీసుకుని ఆభరణాలను స్వాధీ నం చేసుకున్న జీఆర్‌పీ ఎస్‌ఐలు సుబ్బారెడ్డి, టి. మాధవ్ బృందానికి అధికారులు రివార్డులను ప్రకటించారు.


