సుందరయ్య విజ్ఞాన కేంద్రం: రాష్ట్రంలో ఉద్యమకారులను గుర్తించి వారి పోరాటానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి న్యాయం చేస్తున్నారని పోలీస్ కంప్లైంట్ అథారిటీ మెంబర్, పూర్వ సమాచార కమిషనర్ డా. వర్రె వెంకటశ్వర్లు అన్నారు. ఆదివారం బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కళ్యాణ మండపంలో అరుణోదయ విమలక్క 50 ఏళ్ల ప్రస్థానంలో 50 గంటల ఆట..పాట కార్యక్రమంలో కళాకారులు, గాయకుల ఆట పాటలు ఆకట్టుకునేలా సాగాయి. ఈ సందర్భంగా 50 ఏళ్ల విమలక్క పాటల ప్రస్థాన తీరును ఆవిష్కరించారు. డా. వర్రె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... ఉద్యమ కళాకారిణిగా విమలక్క ఎన్నో పాటలు పాడి ఎంతో మందిని చైతన్యపరిచారని అన్నారు. 50 ఏళ్ల నుంచి తన ప్రస్థానాన్ని కొనసాగించడం అభినందనీయమన్నారు. ‘ఎర్రజెండా నీడలో ఎగిసిన పిడికిళ్లలో‘ అంటూ గోరేటి వెంకన్న పాడుతూ... ఆడుతూ... అందరినీ ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ప్రొ. కాసిం, డా. కాచం సత్యనారాయణ గుప్తా, పి.ఎల్. విశ్వేశ్వరరావు, పొన్న నాగేశ్వరరావు, ప్రొ. వినయ్, ప్రొ. లక్ష్మి, గిడ్డె రామనరసయ్య, జయధీర్ తిరుమల రావు, భూపతి వెంకటేశ్వర్లు, నేరనాల కిషోర్, వేముల పుష్ప, కరుణ, ఘంటసాల వెంకటేశ్వర్లు, రాకేష్, తదితరులు పాల్గొన్నారు.


