గంగ ఒడికి గణేశుడు | - | Sakshi
Sakshi News home page

గంగ ఒడికి గణేశుడు

Sep 26 2026 7:35 AM | Updated on Sep 26 2026 7:35 AM

లడ్డూ.. అ‘ధర’హో

సాక్షి, రంగారెడ్డి జిల్లా: పదకొండు రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించిన గణనాఽథులను శుక్రవారం మేలతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లి సమీప చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేశారు. చిన్నారులు, యువతీయువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. శ్రీజైబోలో గణేశ్‌ మహారాజ్‌కీ.. జై, గణపతి బప్పామోరియా..శ్రీఅంటూ హోరెత్తించారు. మండపాల వద్ద వేలంపాటలు హోరాహోరీగా సాగాయి. లడ్డూ ప్రసాదాన్ని చేజిక్కించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. సరూర్‌నగర్‌ మినీట్యాంక్‌బండ్‌, ఇంజాపూర్‌ చెరువు సహా జిల్లా వ్యాప్తంగా 40 చెరువులు, కుంటలను నిమజ్జనం కోసం ఎంపిక చేశారు. ఎలాాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు.

ఎనిమిది నిమిషాలు.. తొమ్మిది మంది

ఉదయం ఐదు గంటలకే బాలాపూర్‌ గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత వాహనంపై విగ్రహాన్ని పెట్టి గ్రామంలో ఊరేగించారు. ఉదయం 11 గంటలకు ర్యాలీ బొడ్రాయి వద్దకు చేరుకుంది. 11.12 గంటలకు వంగేటి లక్ష్మారెడ్డి లడ్డూ వేలం ప్రారంభించగా 11.19 గంటలకు పూర్తయింది. ఎనిమిది నిమిషాల పాటు సాగిన ఈ వేలంలో తొమ్మిది మంది పోటీ పడ్డారు. వీరిలో వనస్థలిపురం సాహెబ్‌నగర్‌కు చెందిన అర్బన్‌ గ్రూప్‌ అధినేత సామ ప్రణీత్‌రెడ్డి రూ.39 లక్షలకు దక్కించుకున్నారు. గత ఎనిమిదేళ్లుగా పోటీపడుతున్న ఆయన ఈ ఏడాది సొంతం చేసుకున్నారు. లడ్దూ దక్కించుకున్న ప్రణీత్‌రెడ్డిని గుర్రపు బండిలో ఎక్కించి, మేళతాళాలతో ఊరేగించి హనుమాన్‌ వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి, ఇంటికి సాగనంపారు. ఇదిలా ఉండగా గతేడాది బాలాపూర్‌ లడ్డూను దక్కించుకున్న లింగాల దశరథగౌడ్‌కు రెండు తులాల బంగారు గొలుసును ఉత్సవ కమిటీ కానుకగా ఇచ్చింది.

బాలాపూర్‌ టు హుస్సేన్‌సాగర్‌

ప్రత్యేక పూజలు, వేలం పూర్తయిన తర్వాత ఉదయం 12.25 గంటలకు శోభాయాత్ర ప్రారంభమైంది. అశేష భక్తజనం వెంట రాగా గణనాథుడి వాహనం ముందుకు కదిలింది. మల్లాపూర్‌, చంపాపేట్‌, పాతబస్తీ సహా ఇతర ప్రాంతాల్లో నెలకొల్పిన విగ్రహాలు అనుసరించాయి. ఈ శోభ యాత్ర మధ్యాహ్నం 12.50 గంటలకు గుర్రం చెరువుకట్ట దాటింది. మధ్యాహ్నం 1.15 గంటలకు చాంద్రాయణగుట్ట, 1.50 గంటలకు ఫలక్‌నుమా, 2 గంటలకు షంషీర్‌గంజ్‌, 2.30కు శాలిబండ చేరుకుంది. శుక్రవారం మధ్యాహ్నం మక్కా మసీదులో ప్రార్థనలు కొనసాగుతుండటంతో మార్గ మధ్యలో కాసేపు శోభయాత్రను నిలిపివేశారు. ప్రార్థనలు ముగిసిన తర్వాత యథావిధిగా గణనాథుడు ముందుకు కదిలాడు. మధ్యాహ్నం 2.40 గంటలకు చార్మినార్‌ చేరుకుంది. 2.50 గంటలకు చార్మినార్‌ దాటింది. 3.30 గంటలకు అఫ్జల్‌గంజ్‌, సాయంత్రం 4 గంటలకు ఎంజే మార్కెట్‌, 4.30 గంటలకు బషీర్‌బాగ్‌, సాయంత్రం 5.30కు ట్యాంక్‌బండ్‌ చేరుకుంది. సరిగ్గా సాయంత్రం 6 గంటలకు బాలాపూర్‌ గణేశుడి నిమజ్జన కార్యక్రమం ముగిసింది. దారి పొడవునా బాలాపూర్‌ గణేశుడికి భక్తులు నీరాజనం పలికారు. భాగ్యనగర్‌ ఉత్సవ సమితి ఆధ్వర్వంలో చార్మినార్‌, మొజంజాహీ మార్కెట్‌, అబిడ్స్‌, బషీర్‌బాగ్‌, ట్యాంక్‌ బండ్‌ ప్రధాన ద్వారం కూడళ్ల వద్ద స్వాగతం పలికారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం ముగియడంతో పోలీసు, అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.

వెల్లివిరిసిన మతసామరస్యం

వినాయక నవరాత్రి ఉత్సవాల్లో మత సామరస్యం వెల్లివిరిసింది. శోభాయాత్ర మార్గంలో పలువురు ముస్లింలు వినాయక భక్తులకు తాగునీరు, మజ్జిగ సరఫరా చేశారు. బడంగ్‌పేట్‌ సర్కిల్‌ గుర్రంగూడ పరిధిలోని బాలాజీ రెసిడెన్సీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకుడి లడ్డూను అదే ప్రాంతానికి చెందిన ఆర్కిటెక్ట్‌ మహ్మద్‌ హాసీం రూ.33,116కు దక్కించుకున్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ పరిధిలోని బృందావన్‌ కాలనీలో గురువారం రాత్రి నిర్వహించిన లడ్డూ వేలంలో ముస్లింలు పాల్గొని పెద్ద లడ్డూను మహ్మద్‌ హర్షద్‌, చిన్న లడ్డూను బాష దక్కించుకున్నారు.

ఆదిబట్ల జీహెచ్‌ఎంసీ డివిజన్‌ కేంద్రంలోని బూర్జు మైసమ్మ దేవాలయం వద్ద ప్రతిచిన గణపతి లడ్డూను ఆదిబట్ల మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ మర్రి నిరంజన్‌రెడ్డి రూ.21 లక్షలకు దక్కించుకున్నాడు.

బడంగ్‌పేట్‌ వీరాంజనేయ భక్తసమాజం వినాయకుడి లడ్డూ ప్రసాదాన్ని ఆర్‌వీఆర్‌ క్లౌడ్‌ కిచెన్‌ అండ్‌ కేటరింగ్‌ గ్రూప్‌ రూ.10.50 లక్షలకు సొంతం చేసుకుంది. గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం ఆరున్నర లక్షలు తగ్గింది.

చేవెళ్ల రెడ్డి అసోసియేషన్‌ లడ్డూ ప్రసాదాన్ని రూ.13.05 లక్షలకు బండారి కుటుంబ సభ్యులు దక్కించుకున్నారు.

మెయినాబాద్‌ మండలం బాకారం జాగీర్‌ శివాలయం లడ్డూను రూ.7.60 లక్షలకు సామ ప్రభాకర్‌రెడ్డి దక్కించుకున్నారు.

బండ్లగూడజాగీర్‌ కీర్తి రిచ్‌మండ్‌ విల్లాస్‌ గణేశ్‌ లడ్డూ వేలం పాటలో శక్తిమాన్‌ టీమ్‌ రూ.1.1 కోట్లకు దక్కించుకుంది. గత ఏడాది ఇక్కడి ఏకదంతుడి లడ్డూ ఏకంగా రూ.2.31 కోట్లు పలికింది.

కందుకూరు మండలం ముచ్చర్ల గణపతి లడ్డూను ఊటు మహేందర్‌ రూ.5.53 లక్షలకు దక్కించుకున్నారు.

ప్రశాంతంగా నిమజ్జనోత్సవం

చకచక సాగిన బాలాపూర్‌ శోభాయాత్ర

దారిపొడవునా భక్తుల నీరాజనం

పాతబస్తీ మీదుగా హుస్సేన్‌సాగర్‌ తీరానికి చేరిన గణేశుడు

సరూర్‌నగర్‌, మాసబ్‌ చెరువుల వద్ద కోలాహలం

పోటాపోటీగా లడ్డూ వేలం పాటలు

రూ.39 లక్షలు పలికిన బాలాపూర్‌ గణనాథుడి లడ్డూ

గతేడాది దక్కించుకున్న దశరథ్‌గౌడ్‌కు బంగారు కానుక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement