2025 నవంబర్‌లో రూపొందించిన అంచనాలు
నిధుల సమీకరణకు ఆర్‌ఈసీకి అభ్యర్థన
నెత్తిన వేలాడే విద్యుత్ తీగలు, ఇంటర్నెట్ కేబుళ్లు తొలగించి వాటిని భూగర్భంలోకి మార్చి అందమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నగరాన్ని వైర్‌లెస్ సిటీగా మార్చేందుకు సంకల్పించింది. ఇందుకు గతేడాదే ప్రణాళికలు సిద్ధం చేశారు. తాజాగా బిడ్ దాఖలకు అనుమతించడంతో కాంట్రాక్టర్లు పనులు దక్కించుకునేందుకు పోటీపడుతున్నారు.
సాక్షి, రంగారెడ్డిజిల్లా: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ భారీ అక్రమాలకు తెరలేపింది. పనులు ప్రారంభానికి ముందే అంచనాలను అమాంతం పెంచి తమ బినామీ కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు యత్నిస్తోంది. ఒకే పనిని 34 విభాగాలుగా విభజించి, వేర్వేరుగా టెండర్లు ఆహ్వానించింది. ఇప్పటికే కాంట్రాక్టర్లతో సమావేశమైన యాజమాన్యం.. శుక్రవారం నుంచే బిడ్ దాఖలుకు అనుమతించింది. అక్టోబర్ 12 వరకు గడవు ఇచ్చింది.
జీఓకు విరుద్ధంగా అంచనాలు
ప్రభుత్వం గ్రేటర్‌ను వైర్‌లెస్ సిటీగా తీర్చిదిద్దాలని భావించింది. ఆ మేరకు ప్రమాదకరంగా ఉన్న 33 కేవీ, 11 కేవీ, ఎల్‌టీ ఓవర్‌హెడ్ లైన్ల స్థానంలో భూగర్భ విద్యుత్ కేబుళ్లు వేయాలని నిర్ణయించింది. ఆ మేరకు డిస్కం యాజమాన్యం క్షేత్రస్థాయి ఇంజనీర్ల నుంచి నివేదికలు తెప్పించుకుని అంచనాలు రూపొందించింది. రూ.14,725 కోట్లు అవసరం అవుతుందని అంచనా వేసింది. డిస్కం వద్ద అంత బడ్జెట్ లేకపోవడంతో విడతల వారీగా పనులు చేపట్టాలని భావించింది. ఈ మేరకు తొలి దశలో మెట్రోజోన్ పరిధిలోని 11 డివిజన్లలో ఈ యూజీ కేబుల్ పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు 2025 నవంబర్ 29న జీఓ నంబర్ 43 తీసుకొచ్చింది. కానీ ప్రస్తుత ఇంజనీర్లు ఆ జీఓకు విరుద్ధంగా అంచనాలు పెంచడంపై అనేక అనుమాలు వ్యక్తమవుతున్నాయి.
ఏడాది తిరగక ముందే 42% పెంపు..?
మెట్రోజోన్ పరిధిలోని బంజారాహిల్స్, కంటోన్మెంట్, ప్యారడైజ్, బోయిన్‌పల్లి, మెహిదీపట్నం, సైఫాబాద్, అజమాబాద్, చార్మినార్, ఆస్మాన్‌ఘడ్, గ్రీన్‌లాండ్స్, బేగంబజార్ డివిజన్ల పరిధిలో 3,899 కిలో మీటర్ల ఓవర్ హెడ్‌లైన్లను భూగర్భ కేబుళ్లుగా మార్చాలని నిర్ణయించింది. ఇందుకు రూ.4,051 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. పనుల్లో నాణ్యత, వేగం కోసం పెద్ద కాంట్రాక్ట్ ఏజెన్సీకి ఈ పనులు అప్పగించాలని నిర్ణయించింది. అయితే ఇప్పటి వరకు టెండర్లు పిలువ లేదు. పనులు ప్రారంభించలేదు. కానీ.. కాంట్రాక్టర్ల ఒత్తిడికి తలొగ్గి అంచనాలను ఏకంగా రూ.5,756 కోట్లకు పెంచేసింది. సీనియర్ ఇంజనీర్లు ఏదైనా పనిని రూపొందించే ముందే కాస్ట్ డేటా, ఎస్‌ఎస్‌ఆర్ రేట్లను దృష్టిలో పెట్టుకునే పది శాతం అదనంగా అంచనాలు రూపొందిస్తారు. గత అంచనాల రూపకల్పనలో ఒక్క సీఎండీ మినహా మిగిలిన ఇంజనీర్లంతా ఇప్పుడూ కూడా ఉన్నారు. ఒకే పనికి ఏడాది తిరగకుండానే అంచనాలు 42 శాతం ఎలా పెరుగుతాయనే ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది. పనులు పూర్తయ్యే నాటికి ఈ అంచనాలు మరెంత పెరుగుతాయో అనే అనుమానం లేకపోలేదు.
ముక్కలు చేసి.. అంచనాలు పెంచేసి!
2025 నవంబర్‌లో రూ.4,051 కోట్ల అంచనాతో డీపీఆర్
తాజాగా రూ.5,756 కోట్లకు
పెంచుతూ నిర్ణయం
భూగర్భ విద్యుత్ కేబుల్ టెండర్లలో భారీగా అక్రమాలు
అక్టోబర్ 12 వరకు బిడ్ దాఖలుకు గడువు
ప్రతిపాదిత పని కి.మీ./క్వాంటిటీ బడ్జెట్ రూ.కోట్లలో
33కేవీ హెచ్‌డీడీ 180 రూ.110
11కేవీ హెచ్‌డీడీ 2,396 రూ.1,430
33కేవీ, 11కేవీ కంబైన్డ్ 73 రూ.65
33కేవీ, 11కేవీ, ఎల్‌టీ కంబైన్డ్ 24 రూ.25
11కేవీ, ఎల్‌టీ కంబైన్డ్ 1,407 రూ.857
33కేవీ, ఎల్‌టీ కంబైన్డ్ 10 రూ.7
మెయిన్‌రోడ్స్ ఎల్టీ ఓహెచ్‌లైన్స్ 825 రూ.149
ఎల్టీ ఓహెచ్–ఎల్టీ ఏబీ 6,251 రూ.563
ఆర్‌ఎంయూలు 14,051 రూ.823
ఓఎఫ్‌సీ కేబుల్ 3,899 రూ.23
ఈదురు గాలులతో కూడిన వర్షాలకు చెట్ల కొమ్మలు విరిగి లైన్లపై పడుతున్నాయి. తరచూ స్తంభాలు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు నేలకూలడం, గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోవడం ఇబ్బందిగా మారుతోంది. గ్రేటర్‌కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలంటే రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా చూడాలని భావించి, ఆ మేరకు ప్రమాదకరంగా మారిన ఓవర్‌హెడ్‌లైన్ల స్థానంలో భూగర్భ విద్యుత్ కేబుళ్లు ఏర్పాటు చేయాలని భావించి, అంచనాలు సిద్ధం చేసింది. అయితే డిస్కం వద్ద ఆశించిన నిధులు లేకపోవడం, ప్రభుత్వం కూడా బడ్జెట్ కేటాయించక పోవడంతో డిస్కమే స్వయంగా అప్పు తెచ్చి పనులు పూర్తి చేయాలని నిర్ణయించింది. జాతీయ గ్రామీణ విద్యుదీకరణ సంస్థ(ఆర్‌ఈసీ) నుంచి రుణం తీసుకోవాలని భావించి, గతంలోనే 90 శాతం వరకు రుణం పొందేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తాజాగా సవరించిన అంచనా వ్యయానికి సైతం 90 శాతం రుణం మంజూరు చేయాలని ఆర్‌ఈసీని కోరినట్లు విశ్వసనీయంగా తెలిసింది.


