మ్యాన్‌హోల్స్ నిర్వహణ లోపంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల వర్షాలకు మురుగునీటి వ్యవస్థలో పూడిక పేరుకుపోయి, మూతలు ధ్వంసమై మురుగు రోడ్డుపైనే పారుతోంది. దీంతో దుర్వాసనతో పాటు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.
● నిర్వహణ మరిచిన అధికారులు
● ప్రమాదకరంగా మారిన మార్గం
● ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మున్సిపల్‌వాసులు
ఇబ్రహీంపట్నం రూరల్: జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. మ్యాన్ హోల్స్ నిర్వహణ పట్టించుకోకపోవడంతో ఎప్పుడు ఏప్రమాదం జరుగుతుందోనని ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రాకపోకలు సాగిస్తున్నారు. అడపదడపా వచ్చే వర్షాలకే రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. ప్రమాదాలు జరగక ముందే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఏడాదిలోపే మరమ్మతులు
ఆదిభట్ల జీహెచ్‌ఎంసీ పరిధిలోని కొంగరకలాన్ వార్డులో మ్యాన్ హోల్స్ అన్నీ పాడయ్యాయి. కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మకై ్క ఇష్టారాజ్యంగా నాసిరకమైన పనులు చేపట్టడంతోనే ఈ దుస్థితి ఏర్పడిందని పలువురు ఆరోపిస్తున్నారు. కొంగరకలాన్ ఎస్‌బీఐ బ్యాంకు నుంచి కొంగరకలాన్ తండా వరకు(1.5 కి.మీ) రూ.కోట్లు వెచ్చించి యూజీడీ, సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ మార్గంలో సూమారు 95 మ్యాన్‌హోల్స్ ఉండగా వీటిని నిర్మించిన ఏడాదిలోపే అప్పటి పాలకవర్గం, అధికారులు రెండు, మూడు పర్యాయాలు మరమ్మతులు చేయించారు. రిపేర్ పేరిట ప్రజాధనం వృథా చేసారనే ఆరోపణలు వచ్చాయి. నడి రోడ్డులో ఉన్న మ్యాన్ హోల్స్ భారీ వాహనాల రాకపోకలతో ప్రస్తుతం పూర్తిగా ధ్వంసమయ్యాయి. మూతలు పగిలి మురుగు రోడ్డుపై పారుతోంది. మూతలు తెరిచి ఉండడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. జిల్లా కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో ఉన్న సమస్యను పట్టించుకునే వారే లేరంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు త్వరితగతిన స్పందించకుంటే జీహెచ్‌ఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు.
రోడ్లు సక్రమంగా వేయక వర్షాలు కురిసన సమయంలో నీరు నిలుస్తోంది. గ్రామం నుంచి వచ్చే వరద రోడ్డుపైనే నిలిచి కుంటను తలపిస్తోంది. మ్యాన్ హోల్స్ మూతలు తీస్తేనే నీరు అందులోకి వెళ్తోంది. అధికారులు త్వరగా బాగు చేయాలి.
– నీల్ల యాదమ్మ, కొంగరకలాన్
మ్యాన్‌హోల్స్ అన్నీ ధ్వంసమయ్యాయి. ఈ రోడ్డులో భారీ నుంచి అతీభారీ వాహనాలు తట్టుకునే విధంగా నిర్మాణం చేయలేదు. తండాలో ఎప్పుడు మ్యాన్‌హోల్స్ తెరుచుకుని ఉంటున్నాయి. అధికారులు పట్టించుకుని మరమ్మత్తులు చేయాలి. లేదంటే ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉంది. – గోపగళ్ల కృపాకర్


