నేరాలకు కేంద్రంగా ఓల్డ్‌సిటీ శివారు తరచూ హత్యలు,హత్యాయత్నాలు
2026 జూలై 6న బాలాపూర్ పీఎస్ పరిధిలో ఫహద్ బిన్ అబ్దుల్ రహెమాన్ బాల్కషర్(29) అనే జిమ్ కోచ్ దారుణహత్యకు గురయ్యాడు.
2026 జూన్ 28న మీర్‌చౌక్‌కు చెందిన ఒవేజ్ ఖాన్(26) అనే యువకుడిని పహాడీషరీఫ్ పీఎస్ పరిధిలోని తుక్కుగూడ రోడ్డులో హిజ్రాలు హత్య చేసి పడేశారు.
2026 మే 9న బాలాపూర్ పీఎస్ లిమిట్స్‌లో యూపీకి చెందిన ఆదిత్య పాండే(24)ను ఇదే ప్రాంతానికి చెందిన స్నేహితులు కర్రలు, రాడ్లతో దాడి చేసి చంపారు.
2026 ఏప్రిల్ 5న బాలాపూర్ ఠాణా పరిధిలోని వాదే సాల్హె హీన్ కాలనీలో మహ్మద్ నసీర్(22)ను దావత్ చేసుకుందామని తీసుకెళ్లిన స్నేహితులు కత్తులతో పొడిచి చంపారు.
2024 మార్చి 9న కాలాపత్తర్ రౌడీషీటర్ మహ్మద్ ఉస్మాన్(36)ను పహాడీషరీఫ్ ఉమర్ కాలనీలోని దర్గా వద్ద ప్రత్యర్థులు గొంతుకోసి హత్య చేశారు.
2023 ఏప్రిల్ 12న బడంగ్‌పేటలో మహిళను హత్య చేసి సంచిలో కుక్కి పడేసి తుక్కుగూడ హైవేపై పడేశారు.
2023 మార్చి 9న బాలాపూర్‌లో తమ కుమార్తెతో ప్రేమాయాణం సాగిస్తున్నాడనే నెపంతో యువతి కుటంబ సభ్యులు డెకావత్ పవన్‌నాయక్(22)ను దారుణంగా హతమార్చారు.
2022 మార్చి 20న రౌడీషీటర్ ఇలియాస్ నవాబును పాత కక్షల నేపథ్యంలో హత్యచేశారు.
2021 ఆగస్టు 3న జల్‌పల్లి కార్గో రోడ్డు పక్కన గుర్తు తెలియని యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఇప్పటి వరకూ హతుడెవరో.. హంతకులెవరో తేలలేదు.
మామిడిపల్లిలోని ఎస్‌ఎస్‌పీడీఎల్ రియల్ ఎస్టేట్ వెంచర్‌లోని గెస్ట్ హౌస్‌లో 2016 జూన్ 25న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రమాకాంత్ పాండే (40)ను గొంతుకోసి దారుణంగా హత్యచేశారు. వెంచర్‌లోకి తాను తీసుకొచ్చిన ఓ యువతీ, యువకుడే ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు భావించినప్పటికీ నిందితులు ఇప్పటికీ దొరకలేదు. వీరి ఆచూకీ కోసం పోలీసులు బీహార్ వెళ్లినా ఫలితం కనిపించలేదు.
2016 ఆగస్టు 13న పహాడీషరీఫ్– మామిడిపల్లి రహదారి పక్కన ఉన్న ఓ ప్రైవేట్ సంస్థ ఆవరణలో 25 ఏళ్ల గుర్తు తెలియని యువకుడిపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ కేసులోనూ మృతుడెవరో తేలలేదు.
2020 ఏప్రిల్ నెలలో ఇదే సంస్థ ప్రాంగణంలో గుర్తు తెలియని మహిళ అస్తిపంజరం లభ్యమైంది. ఈ కేసులోనూ ఎలాంటి పురోగతి లేదు.
2014 నవంబర్ 15న ఎర్రకుంట అలీనగర్‌లో హత్యకు గురైన యువతి వివరాలు కూడా ఇంకా తెలియరాలేదు.
కత్తుల రాజ్యం!
పహాడీషరీఫ్: ఓల్డ్ సిటీ శివారుగా ఉన్న బాలాపూర్, పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరుగుతున్న నేరాలు కలవరానికి గురిచేస్తున్నాయి. హత్యలు, హత్యాయత్నాలు, అత్యాచారాలు, దోపిడీలతో సామాన్య ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కారణమేదైనా గొడవ జరిగిందంటే రక్తం కళ్ల చూడటమో, ప్రాణాలు తీయడమో చేస్తూ తమలోని ఉన్మాదాన్ని చాటుతున్నారు. అప్పటి వరకు కలిసి ఉన్న స్నేహితులైనా సరే ఘర్షణ జరిగిందంటే కత్తులు దూసుకుని, పీకలు కోస్తున్నారు. ప్రేమ పేరుతో దగ్గరై, కొన్నాళ్లుగా ఓ బిహార్ యువతితో సహజీవనం చేస్తున్న 21ఏళ్ల యువకుడు.. తనను పెళ్లిచేసుకోమన్న పాపానికి ప్రియురాలిని కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన స్థానికులను నివ్వెరపర్చింది. గతేడాది పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జర్మనీ దేశానికి చెందిన ఓ యువతిపై జరిగిన లైంగికదాడి అప్పట్లో తీవ్ర కలకలం రేపింది.
విపరీత ధోరణితోనే..
ఈ ప్రాంతంలో పేదరికం కారణంగా నిరక్షరాస్యులుగా ఉన్న చాలా మంది చిన్నాచితక పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పుట్టి పెరిగిన వాతావరణ ప్రభావం.. భిన్నమైన పరిస్థితుల కారణంగా నేరాలు చేయడం.. జైలు జీవితం గడపడాన్ని సాధారణ విషయంగా భావిస్తున్నారు. గంజాయి, మత్తు ఇంజక్షన్ల నిశాలో విచక్షణ కోల్పోతున్నారు. ఈప్రాంతంలో ఒక్కసారి గొడవ జరిగిందంటే కత్తులతోనే బదులిస్తారు. అలా మొదలవుతున్న దాడులు, ప్రతిదాడుల పరంపర కొనసాగుతోంది.
అనువైన ప్రాంతాలని..
నగర శివారు ప్రాంతంగా ఉన్న ఈ పరిసరాలను నిందితులు, రౌడీషీటర్లు తమకు అనువైన మార్గాలుగా కూడా ఎంచుకుంటున్నారు. శత్రువులను ఎక్కడో హత్య చేసి, అర్ధరాత్రి వేళ మృతదేహాలను తీసుకొచ్చి ఇక్కడి నిర్మానుష్య ప్రాంతాల్లో పడేస్తున్నారు. ఉదయాన్నే మృతదేహాలను చూస్తున్న పోలీసులు చచ్చిందెవరో.. చంపిందెవరో తేల్చలేక తలలు పట్టుకుంటున్నారు.
అధిక శాతం ఉత్తర భారతీయులే..
ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ తదితర ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో జీవనోపాధి కోసం వలస వచ్చి నివాసాలు ఏర్పర్చుకుంటున్నారు. వీరు హత్యలకు గురవుతుండటం లేదా ఒక్కోసారి వీరే హత్యలు చేసి, స్వస్థలాలకు పారిపోతుండటంతో కేసుల దర్యాప్తు ముందుకు సాగని పరిస్థితి నెలకొంటోంది. పాతబస్తీ నుంచి వచ్చిన రౌడీషీటర్లు ఇక్కడ హత్యలు చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. నేరాల నియంత్రణకు పోలీసులు రాత్రి పూట కార్డన్ సెర్చ్, ‘ఆపరేషన్ చబుత్రా మిషన్’తో పాటు యువతకు అవగాహన కల్పిస్తున్నా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు.
నిందితుల జాడ కోసం వెతుకుతున్న
పోలీస్ జాగిలం
తుక్కుగూడ రహదారిపై హత్యకు గురైన మహిళ మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
హత్యోదంతాలు ఇవీ..


