షాబాద్: ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి సుజాత పేర్కొన్నారు. షాబాద్ రైతు వేదికలో మంగళవారం వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ), వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఆర్‌పీఎల్ ఆధారిత రైతులకు రెండు రోజుల శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు ప్రస్తుతం కందులు, పెసర, మినుము, కూరగాయల పంటలు సాగు చేసుకోవాలని సూచించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్‌రెడి మాట్లాడుతూ.. రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటిస్తూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆత్మ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ మధుమోహన్ మాట్లాడుతూ.. రైతులకు యాజమాన్య పద్ధతులపై శిక్షణ ఇవ్వనున్నట్టు చెప్పారు. దీర్ఘకాలం సేంద్రియ వ్యవసాయం చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విజయకుమార్ అన్నారు. చేవెళ్ల ఏడీఏ సురేష్‌బాబు మాట్లాడుతూ.. రైతులు వరి పొలాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఎలాంటి తెగుళ్లు కనిపించినా వెంటనే వ్యవసాయ అధికారులకు సమాచారం ఇచ్చి, సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, సహకార సంఘం చైర్మన్ చల్లా శేఖర్‌రెడ్డి, సర్పంచులు గుండాల అశోక్, ప్రభాకర్‌రెడ్డి, షాబాద్ ఎఫ్‌పీఓ–సీఈఓ చంద్రశేఖర్‌రెడ్డి, మండల వ్యవసాయాధికారి దండెం విజయచంద్ర, ఏఈఓలు శివతేజ, మౌనిక, రాజేశ్వరి, బాబ్యనాయక్, శైలజ, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.


