ఇబ్రహీంపట్నం రూరల్ : సామాజిక సమానత్వం కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకమని అదనపు కలెక్టర్ డాక్టర్ కె.కిరణ్మయి పేర్కొన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ జయంతి వేడుకలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పాపన్నగౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. అణగారిన వర్గాల హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన మహనీయుడని కొనియాడారు. ప్రతి ఒక్కరూ పాపన్నగౌడ్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి కేశురాం, తెలంగాణ బీసీ ఫ్రంట్ చైర్మన్ మల్లేష్ యాదవ్, టీపీసీసీ కార్యదర్శి శివకుమార్, కాంగ్రెస్ నేత కొత్తకుర్మ మంగమ్మ, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎగ్గిడి సత్తయ్య, ప్రధాన కార్యదర్శి బండ ఆంజనేయులు, కార్యదర్శి రవిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


