ప్రతి ఓటరు పేరును పరిశీలించుకోవాలి
‘సర్’ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ముసాయిదా ఓటరు జాబితా సోమవారం విడుదలైంది. ఉమ్మడి జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 47,17,671 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 32,20,026 ఓట్లు మాత్రమే మ్యాపింగ్ అయ్యాయి. 14,97,388 ఓట్లను జాబితా నుంచి తొలగించింది. ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించని వారు, చనిపోయిన వారి ఓట్లతో పాటు ఆచూకీ దొరకని వారు, అడ్రస్ మారిన వారి ఓట్లు కూడా ఉన్నాయి. అనామలిస్ కేటగిరిలో ఉన్న మరో 7,92,937 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయనుంది. వీరంతా సెప్టెంబర్ 16 లోగా సంబంధిత ఎన్నికల అధికారులను సంప్రదించి, నిర్ణీత విధానంలో దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల కమిషన్ సూచించింది.
రంగారెడ్డిలో 5,60,201 మందికి నోటీసులు
ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 36,99,743 మంది ఓటర్లకు, 24,12,652 ఓట్లు మాత్రమే మ్యాపింగ్ పూర్తయింది. మ్యాపింగ్ కానీ 12,87,091 ఓట్లను జాబితా నుంచి తొలగించారు. తాజా ముసాయిదా ప్రకారం ఇబ్రహీంపట్నంలో 2,59,317 మంది ఓట్లు మ్యాపింగ్ కాగా, ఎల్బీనగర్‌లో 3,37,919 మంది, మహేశ్వరంలో 3,39,306 మంది, రాజేంద్రనగర్‌లో 3,88,278 మంది, శేరిలింగంపల్లిలో 4,43,544 మంది, చేవెళ్లలో 2,18,274 మంది, కల్వకుర్తిలో 2,16,890 మంది, షాద్‌నగర్‌లో 2,09,124 మంది ఓట్లు మ్యాపింగ్ అయ్యాయి. ఇదిలా ఉంటే జిల్లాలో 88,647 మంది ఓటర్లు చనిపోగా, మరో 3,09,329 మంది ఆచూకీ లభించ లేదు. 7,77,008 మంది ఓటర్లు మరో చోటుకి వలస వెళ్లారు. ఇతరులు 22,902 మంది ఉన్నారు. 89,205 మంది ఓటర్లు మరో చోట ఓటును నమోదు చేసుకుని ఉన్నారు. ఇంటిపేరు, ఓటరు పేరు, ఆధార్ కార్డుల్లో తప్పులు దొర్లిన 5,60,201 మందికి నోటీసులు జారీ చేయనున్నారు. వీరంతా సంబంధిత ధృవీకరణ పత్రాలతో అధికారులకు దరఖాస్తు చేయాల్సి ఉంది.
వికారాబాద్‌లో 2,32,736 మందికి నోటీసులు
నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 10,17,671 మంది ఓటర్లకు, 8,07,374 ఓట్లు మాత్రమే మ్యాపింగ్ పూర్తయింది. మరో 2,10,997 ఓట్లు జాబితా నుంచి తొలగించారు. తాజా ముసాయిదా ప్రకారం పరిగిలో 2,23,404 మంది ఓటర్లు, వికారాబాద్‌లో 1,85,726 మంది ఓటర్లు, తాండూరులో 1,86,704 మంది ఓటర్లు, కొడంగల్‌లో 2,11,540 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నాలుగు నియోజకవర్గాల్లో 542 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. 39,951 మంది మృతులు ఉండగా, 40,866 మంది ఆచూకీ దొరకని వారు ఉన్నారు. ఇక 91,354 మంది శాశ్వతంగా వలస వెళ్లారు. 1,068 మంది ఇతరులు ఉండగా, 37,058 మంది ఇప్పటికే మరో చోట ఓటు హక్కును కలిగి ఉన్నారు. అయితే అనామలిస్ కేటగిరిలో ఉన్న 2,32,736 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. వీరంతా ఎన్నికల కమిషన్ సూచించిన ధ్రువీకరణ పత్రాలతో సెప్టెంబర్ 16లోగా సంబంధిత అధికారులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.
జిల్లాలో 12,87,091,
వికారాబాద్‌లో 2,10,297 ఓట్ల తొలగింపు
అనామలిస్ కేటగిరీ వారికి నోటీసులు
సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాల స్వీకరణ
మార్పులు, చేర్పుల దరఖాస్తుకు అవకాశం
అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడటంతో పాటు, అనర్హుల పేర్లు లేకుండా పారదర్శకమైన, తప్పులులేని ఓటరు జాబితా రూపొందించడమే లక్ష్యంగా సర్ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా ఎన్నికల సంఘం అధికారి, జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. ముసాయిదా జాబితాలో పేరు లేని అర్హత కలిగిన వ్యక్తులు, అలాగే ఓటరు వివరాల్లో మార్పులు లేదా సవరణలు కోరుకునే వారు నిర్ణీత గడువులోగా క్లెయిమ్‌లు, అభ్యంతరాలు లేదా సవరణలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ముసాయిదా ఓటరు జాబితాపై అందిన క్లెయిమ్‌లు, అభ్యంతరాలను నిబంధనల ప్రకారం పరిశీలించి తుది ఓటరు జాబితా రూపొందిస్తామని స్పష్టం చేశారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముసాయిదా ఓటరు జాబితాలో తమ పేరు, వివరాలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలని ఆయన కోరారు.
ఓట్లు


