తుక్కుగూడ: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థ (టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్) నీట్ ఉచిత లాంగ్ టర్మ్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 2026–27 విద్యా సంవత్సరానికి గాను అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తు చేసుకోవాలని జోనల్–6 అధికారి ఎం.భీమయ్య సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరంలో బైపీసీలో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై నీట్–2026 పరీక్షకు హాజరైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూసీ విద్యార్థులు అర్హులని చెప్పారు. అర్హత ఉన్న విద్యార్థులు ఈనెల 22 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
మంచాల: మండల పరిధిలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్(టీపీఎస్) ఆరుట్ల విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఓయూ అధ్యాపకురాలు మాధవి తెలిపారు. సోమవారం పాఠశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి హాజరైన ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 22వరకు ఇంగ్లిష్ నైపుణ్యాలు, కమ్యూనికేషన్ సామర్థ్యాలు, వ్యక్తిత్వ వికాసం తదితర అంశాలపై ప్రత్యేక శిక్షణ ఉంటుందని చెప్పారు. ఉన్నత విద్య అభ్యసించడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచన లు, సలహాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకుడు జితేందర్ నాయక్, హెచ్‌ఎం గిరిధర్‌గౌడ్, ఎంఈఓ రాందాస్ తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం: తెలంగాణ సర్పంచ్‌ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా తుర్కగూడ సర్పంచ్ ఏనుగు నరేందర్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్యగౌడ్ సమక్షంలో సోమవారం నగరంలో నిర్వహించిన సమావేశంలో నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు యాదయ్యగౌడ్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, పార్టీ నాయకుడు ప్రశాంత్‌కుమార్‌రెడ్డికి, సర్పంచ్‌లు, మండల నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.
పీఆర్టీయూతోనే ఉపాధ్యాయులసమస్యలకు పరిష్కారం
సంఘం జిల్లా అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి
కొందుర్గు: ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల సమస్యలు పీఆర్టీయూతోనే పరిష్కారమవుతాయని సంఘం జిల్లా అధ్యక్షుడు మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం పీఆర్‌టీయూ జిల్లేడ్ చౌదరిగూడ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కమిటీ అధ్యక్షుడు సురేశ్‌కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాస్‌రెడ్డి మరోసారి ఎన్నికయ్యారు. గౌరవాధ్యక్షులుగా ప్రకాశ్, అసోసియేట్ అధ్యక్షుడిగా గణేశ్, మహిళా అధ్యక్షులుగా శ్వేత, పార్వతమ్మ, ఉపాధ్యక్షులుగా శోభన్, కార్యదర్శులుగా వాజీద్ అలీ, మహేశ్, మహిళా కార్యదర్శులుగా శ్రీవాణి, సుమ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయుల సమస్యల సాధన కోసం ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జగన్మోహన్ గుప్తా, కృష్ణారెడ్డి, రాఘవేందర్ రెడ్డి, నాజర్ అలీ పాల్గొన్నారు.
పార్క్ చేసిన ఆటోకు నిప్పు
మీర్‌పేట: పార్కింగ్ చేసిన ఆటోకు నిప్పంటించిన సంఘటన మీర్‌పేట ఠాణా పరిధిలో చో టు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. జిల్లెలగూడ డీఎన్‌ఆర్‌కాలనీకి చెందిన రమావత్ చందు ఆటోడ్రైవర్. సోమవారం తెల్లవారుజామున ఇంటి ముందు పార్కు చేసిన ఆటోకు ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో గమనించిన స్థానికులు మంటలు ఆర్పివేశారు. పా త గొడవల కారణంగా తన అన్న అల్లుడు కిష న్ ఆటోకు నిప్పు పెట్టి ఉంటాడని బాధితుడు చందు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలిలో పెట్రోల్ బాటిల్ లభ్యమైంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


