సాక్షి, రంగారెడ్డిజిల్లా: సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రతీ సోమవారం కలెక్టరేట్ సముదాయాల్లో నిర్వహిస్తున్న ‘ప్రజావాణి’కార్యక్రమానికి బాధితులు పోటెత్తుతున్నారు. అధికారుల ముందు తమ గోడును వెల్లబోసుకుంటున్నారు. అయినా మెజార్టీ బాధితుల సమస్యలకు పరిష్కార మార్గం లభించక వారు మళ్లీ..మళ్లీ ఫిర్యాదు చేసేందుకు వస్తున్నారు. ఈ ప్రజావాణికి వస్తున్న భూ బాధితుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఏకంగా 136 ఫిర్యాదులు అందాయి. జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్‌ఓ) శారదాదేవి, జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌మోహన్ సహా పలువురు ఉన్నతాధికారులు బాధితుల నుంచి అర్జీలను స్వీకరించి, ఆయా శాఖల ఉన్నతాధికారులకు సిఫార్సు చేశారు. నిషేధిత జాబితాల్లోని భూములు, భూ విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, మిస్సింగ్ సర్వే నంబర్లకు సంబంధించి 60 ఫిర్యాదులు అందగా, ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన బిల్లులు, రేషన్‌కార్డులు, వృద్ధాప్య పెన్షన్లు, ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల్లో అధిక ఫీజుల వసూళ్లు, తదితర అంశాలకు సంబంధించిన దరఖాస్తులు 76 వచ్చాయి. వీటిని ఆయా శాఖల అధికారులకు పంపించి, సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాల్సిందిగా సూచించారు.
మండలస్థాయిలో ప్రజావాణి షురూ..
సోమవారం మండలస్థాయిలో తొలి ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమైంది. షాబాద్‌లో తొమ్మిది అర్జీలు అందగా, వీటిలో ఏడు రెవెన్యూ, రెండు విద్యుత్ సమస్యలకు సంబంధించినవి ఉన్నాయి. ఇక శంకర్‌పల్లిలో ఎనిమిది ఫిర్యాదులు అందగా, వీటిలో ఫిరంగినాలా కబ్జా, మోకిలలోని ఓ అపార్ట్‌మెంట్ నుంచి పిల్లిగుండ్లకు వస్తున్న వ్యర్థాలు, పొద్దుటూరు, దొంతన్‌పల్లి, ఫతేపూర్‌లలో నక్షబాట కబ్జాకు సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి. ఇక మొయినాబాద్‌లో తొమ్మిది ఫిర్యాదులు అందగా, వీటిలో భూ సంబంధిత సమస్యలు ఐదు, పంచాయతీరాజ్ రెండు, గృహ నిర్మాణ సంస్థకు సంబంధించి ఒకటి, విద్యాశాఖకు సంబంధించి ఒకటి చొప్పున ఫిర్యాదులు అందాయి. మంచాలలో ఎనిమిది ఫిర్యాదులు అందగా, వీటిలో ఏడు రెవెన్యూ సంబంధ సమస్యలు, ఒకటి విద్యాశాఖకు సంబంధించిన ఫిర్యాదు ఉంది. ఇక యాచారంలో మూడు, ఇబ్రహీంపట్నంలో నాలుగు అర్జీలు అందాయి. కందుకూరులో తొమ్మిది ఆర్జీలు అందగా, వీటిలో రెవెన్యూకు సంబంధించి ఏడు, మిషన్ భగీరథ, పంచాయతీరాజ్‌శాఖలకు సంబంధించి ఒక్కో అర్జీ ఉంది. కొత్తూరులో మూడు ఫిర్యాదులు అందగా, వీటిలో రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపాలిటీలకు సంబంధించినవి ఉన్నాయి. కేశంపేటలో ఏడు ఫిర్యాదులు అందగా, వీటిలో ఐదు రెవెన్యూ సంబంధ, ఒకటి విద్యుత్, మరొకటి ఉపాధ్యాయుడి డిప్యూటేషన్ రద్దు చేయాలని కోరుతూ విద్యాశాఖకు సంబంధించిన ఫిర్యాదు అందినట్లు అధికారులు ప్రకటించారు. అదేవిధంగా కొందుర్గులో రెండు, చౌదరిగూడలో నాలుగు అర్జీలు అందాయి.
మండలాల్లోనూ ఫిర్యాదుల వెల్లువ


