గడువులోపు ‘సర్ పూర్తి చేస్తాం
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇందుకోసం ప్రభుత్వ ఆస్పత్రులు, పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టబోతున్నాం. సకాలంలో విధులకు హాజరు కాని, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వైద్యులు, ఉపాధ్యాయుల పట్ల కఠినంగా వ్యవహరించబోతున్నాం.’ అని జిల్లా అదనపు(స్థానిక సంస్థలు) కలెక్టర్ డాక్టర్ కొప్పిశెట్టి కిరణ్మయి స్పష్టం చేశారు. ఇటీవల బాన్సువాడ(కామారెడ్డి) నుంచి జిల్లా అదనపు కలెక్టర్‌గా బదిలీపై వచ్చారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె తొలిసారి ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. స్వతహాగా వైద్యురాలిగా పని చేసిన అనుభవం ఉన్నందున విద్య, వైద్యానికి ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు.
సీజనల్‌పై అవగాహన కల్పిస్తాం
వర్షాకాలంలో పారిశుద్ధ్య లోపం తలెత్తే ప్రమాదం ఉంది. వీధుల్లో పేరుకుపోయిన చెత్తను రోజుల తరబడి ఎత్తకపోవడం, ఇంటి చుట్టూ మురుగు నీరు నిల్వ ఉండటంతో ఈగలు, దోమలు వ్యాపిస్తుంటాయి. వీటి కట్టడికి, సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తాం. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే పంచాయతీ, మున్సిపల్ సిబ్బందిపై చర్యలు తీసుకుంటాం. కలుషిత ఆహారం, నీరుతో అనేక మంది వాంతులు, విరేచనాలతో బాధపడుతుంటారు. టైఫాయిడ్, చికున్‌గున్యా, డెంగీ, మలేరియా జ్వరాలతో బాధపడే నిరుపేదలకు మెరుగైన వైద్యసేవలు అందేలా చర్యలు చేపడతాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేస్తున్న వైద్య సిబ్బంది చాలా వరకు ఉదయం 11 తర్వాత వచ్చి మధ్యాహ్నం రెండు గంటలకే ఇంటి ముఖం పడుతున్నట్లు ఫిర్యాదులున్నాయి. ఆకస్మిక తనిఖీలు చేపట్టి.. ఆలస్యంగా వచ్చి, నిర్ధేశిత సమయానికి ముందే వెళ్లి పోతున్న వైద్య సిబ్బంది పట్ల కఠినంగా వ్యవహరించబోతున్నాం.
వసతి గృహాలపై ప్రత్యేక నిఘా
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థి వసతి గృహాలు, ప్రభుత్వ పాఠశాలల ఆవరణలను పరిశుభ్రంగా ఉంచాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. విద్యార్థులకు ఉచిత పాఠ్యాపుస్తకాలు, నోట్‌బుక్స్ అందజేశాం. నెలాఖరులోగా రెండు జతల బట్టలు కూడా అందజేస్తాం. ప్రభుత్వం పాఠశాలల్లో ఉచిత అల్పాహార పథకం, మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తోంది. పాఠశాలలు, వసతి గృహాలపై పర్యవేక్షణ మరింత కఠినతరం చేస్తాం. అవసరమైతే వారంలో ఒకటి రెండు వసతి గృహాల్లో స్వయంగా తనిఖీ చేస్తా. పేద విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న బియ్యం, కోడిగుడ్లు, పండ్లు, పాలు, ఇతర నిత్యవసర సరుకుల నాణ్యతను పరిశీలిస్తాం. చాలా మంది ఉపాధ్యాయులు పోస్టింగ్ పొందిన చోట పని చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వాటిని ప్రక్షాళన చేస్తాం.
వైద్యుల పనితీరుపై నిరంతర పర్యవేక్షణ
వేళకు పాఠశాలకు చేరని టీచర్లపై వేటు తప్పదు
గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం తలెత్తకుండా చర్యలు
‘సాక్షి’తో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ కొప్పిశెట్టి కిరణ్మయి
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియ జిల్లాలో కొంత మందకొండిగా సాగుతున్న మాట నిజమే. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలతో పోలిస్తే, జీహెచ్‌ఎంసీ పరిధిలోని వార్డుల్లోనే ఈ సమస్య ఎక్కువగా ఉంది. బూత్‌స్థాయి అధికారులు(బీఎల్‌ఓ)లు ఇప్పటికే ఓటర్లందరికీ ఎన్యూమరేషన్ ఫారాలు అందజేశారు. అయితే ఇచ్చిన ఫారాలు తిరిగి బీఎల్‌ఓలకు చేరడం లేదు. మెజార్టీ ఓటర్లు రెండు చోట్ల ఓటు హక్కును కలిగి ఉన్నారు. ప్రస్తుత సర్ ప్రక్రియతో సొంతూరుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతేకాదు అర్బన్ ఏరియాలో ఇతర ప్రాంతాల్లో వలస వచ్చిన వారు తరచూ ఇళ్లు మారుతుండటం, ఫోన్ నంబర్లు కూడా పని చేయకపోవడం ట్రాకింగ్‌కు ఇబ్బంది అవుతుంది. డిజిటలైజేషన్ ఇప్పటికే 50 శాతం పూర్తైంది. ఇతర మున్సిపాలిటీలతో పోలిస్తే.. ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్ ఈ విషయంలో కొంత వెనుకబడి ఉన్నాయి. బీఎల్‌ఓలను అప్రమత్తం చేసి నిర్ధేశిత గడువులోగా డిజిటలైజేషన్‌కు కృషి చేస్తున్నాం.


