హయత్‌నగర్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి అతిథి అధ్యాపకులుగా పని చేసేందుకు ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ సురేశ్‌బాబు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం ఏడు ఖాళీల్లో బీబీఏ–2, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్–3, సంస్కృతం–1, స్టాటిస్టిక్స్–1 ఖాళీలు ఉన్నాయని, సంబంధిత సబ్జెక్టులలో 55 శాతం(ఎస్సీ, ఎస్టీలకు 50శాతం) మార్కులతో పీజీ పొందిన వారు అర్హులని ఆయన వివరించారు. దరఖాస్తులను ఈ నెల 25 సాయంత్రం 5 గంటల లోపు కళాశాలలో సమర్పించాలని సూచించారు.
మొయినాబాద్: అత్యవసర పరిస్థితుల్లో సేవలందించడంలో జాప్యం చేయొద్దని ఈఎంఆర్‌ఐ జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ షేక్ జాన్ షాహిద్ అన్నారు. మొయినాబాద్‌లోని 108 అంబులెన్స్ వాహన సేవలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబులెన్స్‌లోని పరికరాలు, మందులు, రికార్డులు పరిశీలించారు. సిబ్బంది అందిస్తున్న సేవల పట్ల ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 108కు కాల్ వస్తే వెంటనే స్పందించి వాహనంతో సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు తగిన చికిత్స అందించి, దగ్గరలోని ఆసుపత్రికి తరలించాలన్నారు. స్థానికంగా మంచి సేవలు అందిస్తున్నారని 108 సిబ్బంది శ్రీకాంత్, రాజేష్, జిల్లా మేనేజర్ రాజాబాబును అభినందించారు.
డీఈఓ వెంకటేశ్వర్లు
మహేశ్వరం: విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను అందించేందుకు ఆధునిక బోధన పద్ధతులను అనుసరించాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. బుధవారం మండల పరిధిలోని మెహబ్బత్‌నగర్ గ్రామ సమీపంలో ఉన్న భాష్యం బ్లూమ్స్ స్కూల్‌లో ఎస్జీటీలకు నిర్వహించిన మూడు రోజుల పాటు ఇంటిగ్రేటెడ్ ఇన్ సర్వీస్ శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడుతూ.. చదువులో వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. రెగ్యులర్ తరగతి బోధనకు ఆటంకం కలగకుండా, అభ్యసన సామర్థ్యాలను మెరుగు పరుచుకోవాలన్నారు. ఆటలు, పాటలు చురుకై న కార్యకాలపాల ద్వారా ఆహ్లాదంగా బోధించే పద్ధతులను అవలంబించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ కస్నానాయక్, రిసోర్స్ పర్సన్ ఆనంద్‌కుమార్, సీపీ నాయుడు, పి.మహేష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కందుకూరు: రైతులు భూసేకరణకు సహకరించాలని ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి కోరారు. మండల పరిధిలోని తిమ్మాపూర్ రెవెన్యూలో సర్వే నంబర్ 38లో 350.30 ఎకరాలు, సర్వే నంబర్ 162లో 217 ఎకరాల ప్రభుత్వ భూమిని టీజీఐఐసీ ద్వారా సేకరించడానికి గతంలో నోటిఫికేషన్ జారీ చేశారు. అందులో 88 ఎకరాలు మినహా మిగతా రైతులు అందరూ అంగీకార పత్రాలను అందించారు. ఆ రైతులతో బుధవారం తహసీల్దార్ గోపాల్ ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడారు. భూములు ఇవ్వడానికి అంగీకరించే రైతులకు ఎకరాకు రూ.82 లక్షలతో పాటు అదనంగా ఒక ప్లాటు చొప్పున పరిహారం అందుతుందన్నారు. కార్యక్రమంలో ఏసీపీ జానకీరెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు, తిమ్మాపూర్, జబ్బార్‌గూడ సర్పంచ్‌లు గానుగపేట అంజమ్మ, ఎం.సతీష్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.


