మీర్‌పేట: నీట్ పేపర్ లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ(డీసీసీ) అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి డిమాండ్ చేశారు. నీట్ వ్యవహారంలో న్యాయం కోరుతూ ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని, అలాగే ఈ అంశంపై నిరసన తెలిపిన ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీతో పాటు ఇతర నాయకులను అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ బుధవారం జిల్లెలగూడ అంబేడ్కర్ విగ్రహం వద్ద నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు మూతికి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయం కోరిన విద్యార్థులపై లాఠీచార్జి చేయడం బాధాకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తోందని, అభివృద్ధి విషయంలో విఫలమైందని ఆరోపించారు. నీట్ పేపర్ లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో పీసీసీ ప్రధాన కార్యదర్శి పారిజాత నర్సింహారెడ్డి, జిల్లా కార్యదర్శి శేఖర్‌రెడ్డి, పార్టీ డివిజన్ అధ్యక్షులు బాల్‌రెడ్డి, శ్రీశైలం, సురేందర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యులు దశరథ్, రాంచందర్‌తో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి


