బీఎల్‌ఓలు ఫోన్లు చేస్తున్నా స్పందించని ఓటర్లు
యాచారం: సర్ ప్రక్రియపై ఓటర్ల స్పందన అంతంత మాత్రమే కనిపిస్తోంది. పల్లెల నుంచి నగరానికి వలస వెళ్లి స్థిరపడిన వారికి స్వగ్రామాలతో పాటు నివాస స్థలంలోనూ ఓటు హక్కు ఉంది. రెండు ఓట్లు కలిగిన ఓటర్లు అక్కడ.. ఇక్కడ ఓట్లేస్తూ వచ్చారు. గ్రామాల్లో పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వస్తే వీరి ఓట్లే కీలకం. ఏళ్ల క్రితం ఉద్యోగ, వ్యాపార రీత్యా హైదరాబాద్ మహానగరంలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వారు ఆర్థికంగా ఎదగడంతో పాటు గ్రామాల్లోని రాజకీయాలను శాసించే స్థాయిలో ఉన్నారు. మెజార్టీ పంచాయతీల్లో వలస ఓటర్లు ఎక్కడ మొగ్గుచూపితే ఆ అభ్యర్థే విజయం సాధిస్తాడనే నమ్మకం పోటీదారుల్లో నెలకొంది. దీంతో పల్లెల్లో సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీగా పోటీ చేసే ఆశావహులంతా ఆ ఓటర్లను మచ్చిక చేసుకోవడం కోసం భారీగా ఖర్చు చేస్తుంటారు.
ఓటుపై తర్జనబర్జన
మండలంలోని 24 పంచాయతీల్లో మొత్తం 50,082 ఓట్లు ఉన్నాయి. ఈ ఓటర్లల్లో దాదాపు 15 వేలకు పైగా ఓటర్లు నగరంలో స్థిరపడిన వారే. యాచారం, నక్కర్తమేడిపల్లి, నందివనపర్తి, గునుగల్, మాల్, చింతుల్ల, చింతపట్ల, నల్లవెల్లి, కొత్తపల్లి మేజర్ పంచాయతీలతో పాటు 2 వేల ఓట్ల లోపున్న మొండిగౌరెల్లి, తమ్మలోనిగూడెం, గడ్డమల్లయ్యగూడెం, తక్కళ్లపల్లి తదితర గ్రామాల్లో 30 శాతానికి పైగా ఓటర్లు నగరంలోనే ఉంటారు. పండుగలు, శుభాకార్యాల సమయాల్లో స్వగ్రామాలకు రాకపోకలు సాగిస్తుంటారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సర్ ప్రక్రియ ఈ ఓటర్లకు గుబులు పుట్టిస్తోంది. తమ ఓటు పట్నంలో ఉంచుకుందామా.. లేదంటే స్వగ్రామంలోనే ఉంచుకుందామా అని ఆయోమయం చెందుతున్నారు. గ్రామాల్లోని తమ మద్ధతుదారులు ఫోన్లు చేసి పల్లెల్లోనే ఉంచుకోవాలని కోరుతుండగా, నగరంలోని స్నేహితులు, రాజకీయ నాయకులు ఇక్కడే ఉంచుకోవాలని ఒత్తిడి తెస్తున్నారు. దీంతో వారు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.
స్పందన కరువు
గ్రామాల్లోని బీఎల్‌ఓలు నగరంలో నివసిస్తున్న ఓటర్లకు ఫోన్లు చేసి సర్ మీ ఎన్యూమరేషన్ ఫాం మా వద్ద ఉంది.. వివరాలు నమోదు చేసి ఇవ్వాలని ఫోన్లు చేస్తున్నా వారి నుంచి స్పందన కరువైంది. సర్ ప్రక్రియ త్వరలోనే ముగుస్తున్న నేపథ్యం, ఉన్నతాధికారుల నుంచి తీవ్ర ఒత్తిళ్లు వస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో ఉండే బీఎల్‌ఓలు తలలుపట్టుకుంటున్నారు. ప్రతీ గ్రామం ఓటర్ల జాబితాలో 30 శాతం మేర ఓటర్లు పట్నంలో ఉన్నారు. వారంతా ఎన్యూమారేషన్ ఫాంలు తీసుకుని నింపి ఇస్తేనే వంద శాతం టార్గెట్ పూర్తవుతుంది. కానీ నగరంలో స్థిరపడిన ఓటర్ల నుంచి స్పందన రాక అధికారులకు ఏం చేయాలో అంతు చిక్కడం లేదు.
30 శాతం మందికి నగరంలోనే నివాసాలు
ఎన్యూమరేషన్ ఫారం ఎక్కడివ్వాలో తేల్చుకోలేకపోతున్న వైనం


