కందుకూరు: రోడ్డు ప్రమాదంలో ఓ కార్మికుడు మృతి చెందాడు. ఈ సంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన బిప్లబ్ సర్కార్(21) సెంట్రింగ్ కార్మికుడు. రాచులూరు గేట్ సమీపంలోని గ్రీన్ రిచ్ హైలాండ్స్ వెంచర్‌లో పని చేస్తున్నాడు. కాగా శనివారం మధ్యాహ్నం చికెన్ తేవడానికి బైక్‌పై కందుకూరు చౌరస్తాకు ప్రయాణిస్తున్న క్రమంలో శ్రీశైలం రహదారిపై నవారు బాల్‌రెడ్డి ఫంక్షన్‌హాల్ వద్ద వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన ఓ కారు అతని వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో బైక్‌పై నుంచి పడిన బిప్లబ్ సర్కార్ పక్కనున్న చెట్టుకు ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు, పోలీసులు 108 అంబులెన్స్ వాహనంలో చికిత్స నిమిత్తం మాధవన్‌జీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈమేరకు ఎస్‌ఐ పరమేశ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
చెత్తసేకరణ వ్యాన్ ఢీకొట్టి రైతు దుర్మరణం
తాండూరు రూరల్: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన తాండూరు మండలం అంతారం గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తాండ్రా కిష్టప్ప(55), వ్యవసాయం చేసేవాడు. ఈ క్రమంలో శనివారం ఆయన ఇంటి నుంచి తాండూరుకు వెళ్లేందుకు నడుచుకుంటూ ఆటో స్టాండ్‌కు వెళ్తుండగా.. చెత్తసేకరణ వ్యాన్ వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృత దేహాన్ని పట్టణంలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య అంజిలమ్మ, ఇద్దరు కూతుర్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు.
కందుకూరు: బైక్ అదుపు తప్పి కింద పడడంతో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. కడ్తాల్ గ్రామానికి చెందిన గురిగళ్ల నరేశ్(30) ప్రైవేట్ ఉద్యోగి. కాగా శుక్రవారం రాత్రి మండల పరిధిలోని బేగరికంచెలో జరిగిన ఓ పుట్టిన రోజు వేడుకకు బైక్‌పై వెళ్లాడు. కార్యక్రమం ముగిశాక తిరిగి స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యలో శ్రీశైలం రహదారిపై నేదునూరు గేట్ సమీపంలోని స్టీల్ షాపు వద్ద బైక్‌పై నియంత్రణ కోల్పోయి కిందపడ్డాడు. దీంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే పోలీసులు అతడ్ని కొత్తగూడ గేట్ వద్ద ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా మృతుడికి మూడు నెలల క్రితమే వివాహమైంది. ఈ మేరకు శనివారం ఎస్‌ఐ పరమేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


