● అదృశ్యమైన 67 రోజులకు సముద్రంలో శవమయ్యాడు..
హస్తినాపురం: ఫిన్‌లాండ్ దేశంలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన నగర విద్యార్థి మణిదీప్‌రెడ్డి సముద్రంలో శవమై తేలాడు. వనస్థలిపురం వైదేహినగర్ కాలనీకి చెందిన మర్ణత– ముత్యంరెడ్డి దంపతుల పెద్ద కుమారుడు మణిదీప్‌రెడ్డి లాతి పట్టణంలోని ఎల్‌యూటీ యానివర్సిటీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతుతున్నాడు. మే 4న తల్లిదండ్రులతో అతడు చివరిసారిగా మాట్లాడాడు. మరునాడు తల్లిదండ్రులు ఫోన్ చేసినా స్పందించలేదు. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు అతడి స్నేహితులు, తెలిసినవారిని వాకబు చేసినా ఆచూకీ లభించలేదు. కాలేజీలో విచారించినా ఫలితం లేకపోయింది. మణిదీప్‌రెడ్డి అదృశ్యమైనట్లు అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా ఈ నెల 9న క్రూనువు ఒరెన్ రంటా సముద్రతీరంలో నిర్వహించిన గాలింపు చర్యల్లో లభించిన మృతదేహం మణిదీప్‌రెడ్డిదిగా ఫెడరల్ బ్యూరో అధికారులు గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. కుమారుడు క్షేమంగా తిరిగి వస్తాడని ఆశగా ఎదురుచూస్తున్న కుటుంబసభ్యులు పిడుగలాంటి వార్త విని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విద్యార్థి మృతికి గల కారణాలను పరిశీలిస్తున్నామని, ఎలాంటి నేరం జరిగినట్లు అనుమానాలు లేవని ఫెడరల్ బ్యూరో అధికారులు వెల్లడించారు. మణిదీప్‌రెడ్డి మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి తరలించేటట్లు చూడాలని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయను కోరినట్లు మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి తెలిపారు.


