సర్వీస్‌ రీడింగ్‌ తీస్తుండగా షాక్‌ | - | Sakshi
Sakshi News home page

సర్వీస్‌ రీడింగ్‌ తీస్తుండగా షాక్‌

Jul 7 2026 6:52 AM | Updated on Jul 7 2026 6:52 AM

అబ్దుల్లాపూర్‌మెట్‌: ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద సిటీ విద్యుత్‌ మీటర్‌ సర్వీస్‌ రీడింగ్‌ తీసుకుంటున్న ఇద్దరు విద్యుత్‌శాఖ సిబ్బందికి షాక్‌ తగలడంతో ఓ లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ అక్కడికక్కడే మృతిచెందగా, మరో లైన్‌మెన్‌ తీవ్ర గాయాలకు గురయ్యాడు. ఈ సంఘటన అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం పిగ్లీపూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు, విద్యుత్‌ శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మెట్‌ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పరిఽధిలో లైన్‌ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న భరత్‌ (51), లైన్‌మెన్‌గా ఉన్న రామ్‌దాస్‌ సోమవారం సాయంత్రం పిగ్లీపూర్‌లోని సర్వేనంబర్‌ 12లో ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద మీటర్‌ సర్వీస్‌ రీడింగ్‌ తీసుకోవడానికి వెళ్లారు. ప్రమాదవశాత్తు ఇద్దరికీ విద్యుత్‌ షాక్‌ తగలడంతో భరత్‌ అక్కడికక్కడే మృతిచెందగా, రామ్‌దాస్‌కు తీవ్ర గాయాలయ్యారు. గాయపడిన రామ్‌దాస్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి, భరత్‌ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆర్‌–ఫేజ్‌ హెచ్‌జీ ఫ్యూజ్‌ వైర్‌ హెచ్‌జీ ఫ్యూజ్‌ స్ట్రక్చర్‌ను తాకడంతో ఏబీ స్విచ్‌ ఆపరేటింగ్‌ పైప్‌ ద్వారా విద్యుత్‌ సరఫరా అయి ఉండొచ్చని, 11 కేవీ లైనన్‌కు సంబంధించిన ఏబీ స్విచ్‌ను ఓపెన్‌ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగి ఉంటుందని విద్యుత్‌శాఖ అధికారులు భావిస్తున్నారు.

సమగ్ర విచారణ చేపట్టాలి

ప్రమాదానికి కచ్చితమైన కారణాలు ఇంకా నిర్ధారణ కాలేదని, సంఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని టీజీఎస్పీడీసీఎల్‌ చైర్మన్‌ – మేనేజింగ్‌ డైరెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. విచారణ నివేదిక అందిన అనంతరం ప్రమాదానికి గల వాస్తవ కారణాలు వెల్లడించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన భరత్‌ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి సంస్థ అండగా ఉంటుందన్నారు.

పహాడీషరీఫ్‌: స్నేహితుల మధ్య నెలకొన్న గొడవలతో ఓ యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బార్కాస్‌ సలాల ప్రాంతానికి చెందిన ఫహద్‌ బిన్‌ అబ్దుల్‌ రెహమాన్‌ బాల్కషర్‌ (29) జిమ్‌ కోచ్‌తో పాటు మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి ఇదే ప్రాంతానికి చెందిన సయీద్‌ బిన్‌ ఫైసల్‌ బామ్‌, సాలం బామ్‌ అనే స్నేహితులు ఉన్నారు. వీరి మధ్య కొన్ని రోజులుగా మనస్పర్థలు తలెత్తాయి. ఈ విషయమై మాట్లాడుకుందామంటూ సోమవారం తెల్లవారుజామున 2.30 గంటలకు మరియం కాలనీకి ఫహద్‌ను ఇద్దరు స్నేహితులు పిలిపించారు. అక్కడికి వెళ్లాక మాటామాటా పెరిగింది. పథకంలో భాగంగా అప్పటికే తమతో పాటు తెచ్చుకున్న కత్తులతో ఫహద్‌పై విచక్షణా రహితంగా పొడిచి పరారయ్యారు. అరుపులు విన్న స్థానికులు వెంటనే బాలాపూర్‌ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కొన ఊపిరితో ఉన్న ఫహద్‌ను చికిత్స నిమిత్తం ఒవైసీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఆదిభట్ల ఏసీపీ ప్రదీప్‌ కుమార్‌ రెడ్డి, బాలాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.సుధాకర్‌ ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్‌ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.

పథకం ప్రకారం రప్పించి.. కత్తులతో పొడిచి

లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ అక్కడికక్కడే మృతి

మరో లైన్‌మెన్‌కు తీవ్ర గాయాలు

పాత గొడవలతో యువకుడి దారుణ హత్య

ఘాతుకానికి ఒడిగట్టింది స్నేహితులే..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement