సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘రాష్ట్రంలో గ్యాస్ కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. జిల్లాలో ఎల్‌పీజీ గ్యాస్ కొరత లేదు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వందతులను నమ్మొద్దు’ అని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంతకు ముందు బుక్ చేసుకున్న తరువాత సరఫరా ఉన్నట్లే ప్రస్తుతం కూడా అదే విధంగా ఉంటుందన్నారు. ఎలాంటి జాప్యం ఉండదని, జిల్లాలో సరిపడా నిల్వలు ఉన్నాయని తెలిపారు. ఆస్పత్రులు, విద్యాసంస్థలకు చెందిన వసతి గృహాలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాల వంటి సంస్థలకు కొరత లేదన్నారు. అవాస్తవాలను, వదంతులను నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
హయత్‌నగర్: మునుగనూరులో నూతనంగా ఏర్పాటు చేసిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని శనివారం స్థానిక ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ప్రారంభించనున్నట్టు రిజిస్ట్రార్ విజయ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా వనస్థలిపురం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని మునుగనూరులోని పాత పంచాయతీ భవనంలోకి మార్చాలని నిర్ణయించినట్టు చెప్పారు. ప్రైవేటు భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలను ప్రభుత్వ భవనాల్లోకి మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా కార్యాలయాన్ని మునుగనూరుకు మార్చినట్లు ఆయన తెలిపారు.
పహాడీషరీఫ్: మామిడిపల్లి నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు నూతన రహదారి నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోయే రైతులకు తగిన నష్టపరిహారం చెల్లిస్తామని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజు తెలిపారు. మామిడిపల్లి వార్డు కార్యాలయంలో శుక్రవారం గ్రామసభ ఏర్పాటు చేసి భూములు కోల్పోయే రైతుల సందేహాలను నివృత్తి చేశారు. మొత్తం తొమ్మిది మంది పట్టాదారులకు సంబంధించి 106, 107, 108 సర్వే నంబర్లలో 3.17 ఎకరాల భూమిని సేకరించనున్నారు. గ్రామం నుంచి రంగనాయకుల దేవాలయానికి వెళ్లే దారి మధ్యలో నుంచి దాదాపు 600 మీటర్ల పొడవులో 100 ఫీట్ల విస్తీర్ణంలో నూతన రహదారిని నిర్మించనున్నట్టు అధికారులు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా భూసేకరణ ప్రక్రియ పూర్తిచేసి పనులు మొదలు పెడతామని వెల్లడించారు. సమావేశంలో బాలాపూర్ డిప్యూటీ తహసీల్దార్ మణిపాల్ రెడ్డి, ఆర్‌ఐ జమీల్, మాజీ కార్పొరేటర్లు సుక్క శివకుమార్, యాతం పవన్‌కుమార్ యాదవ్, జీఎంఆర్ ప్రతినిధులు పాల్గొన్నారు.
శంకర్‌పల్లి: పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను తప్పనిసరిగా వేయించాలని జిల్లా పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ సుభాష్ అన్నారు. మహారాజ్‌పేట్ పశు వైద్యశాల పరిధిలోని జన్వాడలో శుక్రవారం గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యాధికారి శ్రావణిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశువుల్లో వచ్చే వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించాలని తెలిపారు. పశు వైద్యులు గ్రామాలకి వచ్చినప్పుడు వారి సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.


