యాచారం: గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణ పనులను రైతులు శుక్రవారం అడ్డుకున్నారు. కుర్మిద్ద అనుబంధ గిరిజన తండాలైన మంగలిగడ్డ, మర్లకుంట, పోతుబండ తండాల రైతులకు చెందిన 283, 286, 274 తదితర పట్టా సర్వే నంబర్లలోని 30 ఎకరాల భూమిలోంచి గ్రీన్ ఫీల్డ్ రోడ్డు వెళ్తోంది. ఈ రోడ్డు నిర్మాణ పనులను శుక్రవారం ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్‌రెడ్డి, ఏసీపీ కేపీవీ రాజు ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య రెవెన్యూ, టీజీఐఐసీ అధికారులు జేసీబీ, ఇతర యంత్రాలతో పనులు ప్రారంభించారు. సమాచారం తెలుసుకున్న రైతులు తరలివచ్చారు. పట్టా భూములకు సంబంధించి పరిహారం చెల్లింపుపై స్పష్టత లేదని.. సేకరణపై కోర్టుల్లో కేసులు, స్టేలు ఉన్నాయని.. అయినా అధికారులు బలవంతంగా పనులు ప్రారంభించడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు. దీంతో రైతులు, అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కలెక్టర్ వద్ద సమావేశపర్చండి.. అక్కడే తేల్చుకుంటామని రైతులు అన్నారు. రెండు, మూడు రోజుల్లో కలెక్టర్ సమయం తీసుకుని సమావేశం అయ్యేలా చూస్తానని ఆర్డీఓ అనంత్‌రెడ్డి హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.


