మొయినాబాద్: విద్యార్థుల వద్ద అధిక ఫీజులు వసూలు చేస్తూ, ఇబ్బందులకు గురి చేస్తున్న గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం కళాశాల ఎదుట విద్యార్థులతో కలిసి వారు ఆందోళన చేపట్టారు. ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాస్, అరుణ్ మాట్లాడుతూ.. కళాశాల యాజమాన్యం విద్యార్థుల వద్ద అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని పలువురు విద్యార్థులు జేఎన్‌టీయూకి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ విషయం కళాశాల యాజమాన్యానికి తెలియడంతో వైస్ ప్రిన్సిపాల్ అహ్మద్, సిబ్బంది మల్లేశ్‌లు కలిసి సంబంధిత విద్యార్థులను గదిలో బంధించి, దాడి చేసినట్లు ఆరోపించారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించి కళాశాల గుర్తింపును రద్దు చేయాలని, లేకపోతే పెద్దఎత్తున ఉద్యమం చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు అల్లి దేవేందర్, చరణ్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల డిమాండ్


