శంకర్‌పల్లి: మహిళల్లో వచ్చే కేన్సర్‌ని ప్రాథమిక దశలోనే గుర్తించి, సరైన వైద్యం అందించాలని జిల్లా వైద్యాధికారి లలితా దేవి అన్నారు. శంకర్‌పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపును ఆమె పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ నాలుగు విడతల్లో కార్యక్రమాలు చేపడుతుందని స్పష్టం చేశారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం జిల్లాలోని 34 ఆరోగ్య కేంద్రాల్లో, ఆరుగురు స్పెషలిస్ట్ వైద్యులతో మెగా హెల్త్ క్యాంపులను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. పరీక్షలు చేయించుకున్న వారి వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నామన్నారు. ఇటీవలి కాలంలో మహిళల్లో గర్భాశయ కేన్సర్ ఎక్కువగా వస్తుందని, దాన్ని ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు ఈ శిబిరాలు ఉపయోగపడతాయన్నారు. 14 నుంచి 15 ఏళ్ల బాలికలకు హెచ్‌పీ వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా 93శాతం మందికి కేన్సర్ వచ్చే అవకాశం ఉండదన్నారు. కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రేవతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వైద్యాధికారి లలితా దేవి


