మోటార్‌ వాహనాల దొంగ అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

మోటార్‌ వాహనాల దొంగ అరెస్ట్‌

Mar 12 2026 9:10 AM | Updated on Mar 12 2026 9:10 AM

ఎనిమిది కేసుల్లో ప్రమేయం

నిందితుడికి సహకరించిన బాలుడిని జువైనల్‌ హోంకు తరలించిన పోలీసులు

పహాడీషరీఫ్‌: మోటార్‌ వాహనాలతో పాటు ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని పహాడీషరీఫ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. అతని వద్ద నుంచి మూడు ఆటోలు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. పహాడీషరీఫ్‌ ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్‌స్పెక్టర్‌ బి.ఎల్‌.ఎన్‌.రెడ్డితో కలిసి శంషాబాద్‌ ఏసీపీ వి.శ్రీకాంత్‌ గౌడ్‌ కేసు వివరాలు వెల్లడించారు. కొందుర్గుకు చెందిన సల్లంగుల శ్రీకాంత్‌(23) బతుకుదెరువు నిమిత్తం వలస వచ్చి మైలార్‌దేవ్‌పల్లి పరిధిలోని లక్ష్మీగూడలో నివాసం ఉంటూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. సులభంగా డబ్బు సంపాదించేందుకు చోరీల బాటపట్టాడు. బహిరంగ పార్కింగ్‌ ప్రదేశాలు, ఇళ్ల ఎదుట పార్కు చేసి ఉన్న ఆటోలు, ద్విచక్ర వాహనాలను చోరీ చేసి అద్దెకివ్వడం లేదంటే విక్రయించడం చేసేవాడు. ఈ క్రమంలోనే ఈ నెల 2వ తేదీన పహాడీషరీఫ్‌ రంగనాయకుల కాలనీలో దాసరి శరత్‌బాబు అనే వ్యక్తి ఇంటి ఎదుట పార్కు చేసిన ఆటో(ఏపి 24డబ్ల్యూ 9588) చోరీకి గురైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం ఉదయం వాహనాల తనిఖీలు చేపట్టగా అటుగా వచ్చిన శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో నేరాల చిట్టా విప్పాడు. ఈ ఆటో దొంగతనం కేసులో తనకు తోడుగా డబ్బు ఆశజూపి బాలుడి సాయం తీసుకోవడంతో, బాలుడిని అదుపులోకి తీసుకుని జువైనల్‌ హోంకు తరలించారు. ఇళ్ల ఎదుట పార్కు చేసే ఆటోలకు తాళాలు పకడ్బందీగా వేసుకోవడంతో పాటు సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేసుకోవాలని ఈ సందర్భంగా ఏసీపీ వాహనదారులకు సూచించారు. ఈ సమావేశంలో ఎస్సైలు వెంకటేశ్వర్లు, క్రైం సిబ్బంది పాల్గొన్నారు.

ఎనిమిది కేసుల్లో ప్రమేయం.

నిందితుడు ఇప్పటి వరకు పహాడీషరీఫ్‌లో రెండు ఆటోలు, ఒక పల్సర్‌ బైక్‌, కర్నూల్‌ టూ టౌన్‌ పీఎస్‌ పరిధిలో ప్యాసింజర్‌ ఆటో, మహబూబ్‌నగర్‌లో పల్సర్‌ బైక్‌, యాక్టివా, మైలార్‌దేవ్‌పల్లిలో ఒక బైక్‌ను దొంగతనం చేశాడు. ఎనిమిది కేసులకు గాను పోలీసులు ఐదు కేసులకు సంబంధించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. 2025 డిసెంబర్‌లో జల్‌పల్లి శ్రీరామ కాలనీలోని ఆంజనేయ స్వామి ఆలయంలో హుండీ చోరీ చేసి రూ.70 వేల నగదును దోచేశాడు. ఆలయాల్లో ఇలాంటి నేరాలు చేసే వారితో శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉంటుందని ఏసీపీ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement