హత్యచేసి.. దూలానికి వేళాడదీసి! | - | Sakshi
Sakshi News home page

హత్యచేసి.. దూలానికి వేళాడదీసి!

Mar 12 2026 9:10 AM | Updated on Mar 12 2026 9:10 AM

భార్య మృతిపై భర్త అనుమానం

ఆస్పత్రి ఎదుట ఆందోళన

పోలీసులకు ఫిర్యాదు

దౌల్తాబాద్‌: వీధి నాటకం చూసి వస్తానని వెళ్లిన ఓ మహిళ.. పక్కింట్లో దూలానికి వేళాడుతూ విగతజీవిగా కనిపించగా.. ఆమెను చంపి, దూలానికి వేళాడదీశారని మృతురాలి భర్త అనుమానం వ్యక్తం చేశారు. ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధి కుప్పగిరి గ్రామానికి చెందిన మదరప్ప, అశోక్‌ కుటుంబ సభ్యులకు నాలుగు రోజుల క్రితం భూ విషయంలో పంచాయితీ జరిగింది. ఇరు వర్గాలు దాడి చేసుకున్నాయి. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. అక్కడే పెద్దల సమక్షంలో రాజీ కుదుర్చుకొని, ఇకముందు ఎలాంటి గొడవలు చేసుకోమని హామీపత్రం రాసుకున్నారు.

మారుమారు దాడి..

అలా పెద్దల మధ్య ఒప్పందం రాసుకున్న వారు.. భూ విషయంలో మంగళవారం ఉదయం మరోసారి గొడవకు దిగారు. ఇందులో అశోక్‌ భార్య కృష్ణవేణి(31)పై మదరప్ప కుటుంబ సభ్యులు దాడి చేసి, గాయపర్చారు. కాగా.. అదే రోజు రాత్రి గ్రామంలో ప్రదర్శించిన నాటకం చూడటానికి వెళ్తానని చెప్పిన సదరు మహిళ.. తెల్లవారే సరికి పక్కింట్లో దూలానికి ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. దీంతో తన భార్యను మదరప్ప కుటుంబ సభ్యులు హత్యచేసి, ఇలా ఉరి వేశారని మృతిరాలి భర్త, కుటుంబీకులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. పరిసరాలను పరిశీలించి, శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొడంగల్‌ ఆస్పత్రికి తరలించారు. హత్యకు పాల్పడిన వారిని అరెస్టు చేయాలని బాధిత కుటుంబీకులు ఆస్పత్రి ఎదుట ధర్నా చేశారు. కొడంగల్‌ సీఐ శ్రీధర్‌రెడ్డి, ఎస్‌ఐ రాజుకుమార్‌ బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఆందోళనను విరమింపజేశారు. మృతురాలి భర్త అశోక్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement