● సాంకేతిక తరగతులను సద్వినియోగం చేసుకోవాలి
● కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి
బొంరాస్‌పేట: కంప్యూటర్ విద్యతో విశ్వజ్ఞానం పెంపొందుతుందని, ఈ సాంకేతిక విద్యను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధి రేగడిమైలారం ప్రాథమిక పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏఐ కంప్యూటర్ తరగతి ల్యాబ్‌ను ప్రారంభించి మాట్లాడారు. ఇందులో ఎంఈఓ హరిలాల్, సీహెచ్‌ఎం రవీందర్‌గౌడ్, హెచ్‌ఎం మల్లేశ్, ఉపాధ్యాయులున్నారు.
వినతులు
పాఠశాలలో శిథిలావస్థలో ఉన్న తరగతి గదులను తొలగించి, ఉపయోగకరంగా మార్చాలని కడా అధికారికి స్థానికులు విన్నవించారు. గ్రామంలోని జాతీయరహదారిపై వెళ్లే ఎక్స్‌ప్రెస్ ఆర్టీసీ బస్సులు ఆగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. చెరువులకు ఫీడర్‌ఛానళ్లు ఏర్పాటు, పూడికతీత పనులు చేపట్టాలని పలువురు రైతులు వినతిపత్రం అందజేశారు. దీంతో కడా అధికారి మాట్లాడుతూ.. కొత్తూరు, రేగడిమైలారం చెరువుల తూముల మరమ్మతు తదితర పనులకు రూ.18 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. ఇదిలా ఉండగా.. కుబ్యానాయక్‌తండా, నాందార్‌పూర్, బొంరాస్‌పేట, తుంకిమెట్ల గ్రామాల్లో ఆయన పర్యటించారు. 99రోజుల ప్రగతి ప్రణాళిక పనులపై ఆరా తీశారు. వీరి వెంట జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ శేరి రాజేశ్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సింహులు గౌడ్, వెంకట్రాములు గౌడ్, జయకృష్ణ, మల్లేశ్, రాంచంద్రారెడ్డి, మల్లికార్జున్, చంద్రప్ప, గుండప్ప, వెంకట్‌రెడ్డి, వీరప్ప తదితరులు ఉన్నారు.


