మొయినాబాద్: ముదిరాజ్ సంఘం యువత విభాగం జిల్లా ఉపాధ్యక్షుడిగా షాబాద్ మండలం కొమరబండ గ్రామానికి చెందిన సుభాష్‌చంద్రబోస్‌ను నియమించారు. ఈ మేరకు బుధవారం ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు బైరమోని మల్లేశ్ ముదిరాజ్, యువత విభాగం జిల్లా అధ్యక్షుడు నారాయణపురం మహేందర్ ముదిరాజ్ ఆయనకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ ముదిరాజ్‌ల అభివృద్ధికి, సంఘం విస్తరణకు కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వర్తిస్తానన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు లింగం ముందిరాజ్, వెంకటయ్య ముదిరాజ్, సామయ్య ముదిరాజ్, బుచ్చయ్యముదిరాజ్, సర్పంచ్ నర్సింలు ముందిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
బెంగాల్ ప్రభుత్వ తీరు సరికాదు
అనంతగిరి: ఇటీవల పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా రాష్ట్రపతికి జరిగిన అవమానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు యాస్కి శిరీష ఒక ప్రకటనలో తెలిపారు. ఒక పక్క అంతర్జాతీయ మహిళా దినోత్సం పేరిట ప్రపంచమంతా వారోత్సవాలను జరుపుకొంటున్న తరుణంలో మనదేశ అత్యున్నత స్థానంలో ఉన్న రాష్ట్రపతి పట్ల ఇలాంటి ఘటన జరగడం సరైంది కాదన్నారు. అక్కడ జరిగే సదస్సును ముందుగా నిర్ణయించి రాష్ట్రపతి చెప్పిన ప్రాంగణంలో కాకుండా ఆదివాసీ ప్రజలు సభకు చేరుకోవడానికి వీలులేని దూర ప్రదేశానికి బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం మార్చిందన్నారు. రాష్ట్రపతిని ప్రొటోకాల్ ప్రకారం స్వాగతం చేసుకోవాల్సిన సీఎం, మంత్రులు ఎవరు రాలేదన్నారు. కేవలం మేయర్ ఆమెను రిసీవ్ చేసుకున్నారని తెలిపారు.
నూతన భవనాలకు భూ కేటాయింపు
ఆక్రమణకు గురైన భూమి స్వాధీనం: తహసీల్దార్
ధారూరు: మండల పరిధి కొండాపూర్‌కలాన్ గ్రామంలోని సర్వే నంబర్ 62లోని 32 గుంటల ప్రభుత్వ భూమిని సర్వే చేసి, హద్దులు ఏర్పాటు చేశామని తహసీల్దార్ సాజిదాబేగం తెలిపారు. బుధవారం సర్వే అనంతరం ఆమె మాట్లాడారు. ఈ భూమిలో డ్వాక్రా భవనం, గ్రామ పంచాయతీ భవనాలను నిర్మించనున్నామని చెప్పారు. ఓ రైతు ఆక్రమించిన 32 గుంటల భూమిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
ఆక్రమించలేదు.. కబ్జాలో ఉన్నాం
భూమిని ఆక్రమించినట్లు అధికారులు పేర్కొంటున్న వెంకటయ్య, అతని కుటుంబీకులు సర్వేకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధికారులతో వాదనకు దిగారు. తాము ఈ భూమిని ఆక్రమించలేదని, ఏళ్ల తరబడి కబ్జాలో ఉన్నామని తెలిపారు. తమ భూమిలోకి ఎవరూ రావొద్దని పేర్కొన్నాడు. ఈ భూమిని స్వాధీనం చేసుకుంటే.. తాము ఆత్మహత్యకు పాల్పడతామని బెదిరించారు. ఈ క్రమంలో వెంకటయ్య జారి కిందపడటంతో.. అధికారులు 108 వాహనంలో అతన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ.. గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ, డ్వాక్రా భవనాల నిర్మాణాలకు అవసరమైన స్థలం కోసం ఈ 62 సర్వే నంబర్‌లోని 4 ఎకరాలు ప్రభుత్వ భూమిని సర్వే చేయగా.. 32 గుంటల భూమి ఆక్రమణకు గురియైనట్లు తేలిందని వివరించారు. వెంకటయ్య, అతని కటుంబ సభ్యులు చెబుతున్న దాంట్లో ఏ మాత్రం వాస్తవం లేదని ఆమె పేర్కొన్నారు.
అధికారుల నిర్లక్ష్యంతోనే నాయక్ మృతి
పరిగి: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే మోహన్ నాయక్ మృతి చెందాడని మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం కిష్టమ్మగుడితండాలో బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ శాఖలో అప్రమత్తత కరువైందన్నారు. వారి నిర్లక్ష్యంతోనే మరణాలు సంభవిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయక్ మృతి తీరని లోటన్నారు. ప్రభుత్వం వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ముకుంద అశోక్‌కుమార్ ముదిరాజ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సురేందర్, కౌన్సిలర్లు రవికుమార్ పాల్గొన్నారు.


