ఆమనగల్లు: తలకొండపల్లి పోలీసుస్టేషన్ ఎస్‌హెచ్‌ఓగా బుధవారం జానకిరాంరెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు తలకొండపల్లి పోలీసు స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేసిన శ్రీకాంత్‌ను ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌కు అటాచ్ చేశారు. అనంతరం ఆమనగల్లు సీఐగా పనిచేస్తున్న జానకిరాంరెడ్డిని తలకొండపల్లి ఎస్‌హెచ్‌ఓగా బదిలీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన జానకిరాంరెడ్డి మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు.
రెవెన్యూ కార్యాలయం పరిశీలన
ఇబ్రహీంపట్నం: ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి ఇబ్రహీంపట్నంలో తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. అక్కడ తహసీల్దార్ సునితారెడ్డితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అదే విధంగా వ్యవసాయ శాఖ కార్యాలయానికి సైతం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పలు రికార్డులు పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీఓ అనంతరెడ్డి, నాయబ్ తహసీల్దార్ శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
తాండూరు టౌన్: తాళం వేసిన ఇంట్లో చోరి జరిగింది. ఈ సంఘటన పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని సాయిపూర్‌కు చెందిన అంజిలయ్య వారం రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి వివాహ నిమిత్తం ఊరికి వెళ్లారు. బుధవారం వచ్చి చూసే సరికి తాళం పగలగొట్టి, బీరువా తెరిచి ఉన్నట్లు గమనించారు. పరిశీలించగా.. 8 గ్రాముల బంగారం, 5 తులాల వెండితో పాటు రూ. 50 వేల నగదును దుండగులు అపహరించినట్లు గుర్తించారు. అనంతరం బాధిత కుటుంబం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశా రు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.


