వ్యవసాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటయ్య
కొడంగల్ రూరల్: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 7వ తేదీన సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, ఎస్‌ఎఫ్‌ఐ, మహిళా సంఘాలు, డీవైఎఫ్‌ఐ, రైతు సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో కొడంగల్‌లో నిర్వహించనున్న జిల్లా సదస్సును జయప్రదం చేయాలని వ్యవసాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటయ్య కోరారు. బుధవారం పట్టణంలో విలేకరులతో మాట్లాడుతూ అంతర్జాతీయ శ్రామిక పోరాటం స్ఫూర్తితో మార్చి 01వ తేదీ నుంచి 7వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 8వ తేదీన అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా ఐద్వా, సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు, యువజన, విద్యార్థి సంఘాల కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి బుస్స చంద్రయ్య, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి అనిల్, హాస్టల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రాములు తదితరులు పాల్గొన్నారు.


