● డ్రోన్ల ద్వారా పంటల సస్యరక్షణ
● వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త సుధాకర్ చౌరట్
తాండూరు: ఆధునిక వ్యవసాయ పద్ధతులకు సాంకేతిక నైపుణ్యం జోడించడం ద్వారా పంట పెట్టుబడులను ఆదా చేసుకోవచ్చని తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్. సుధాకర్ చౌరట్ అన్నారు. బుధవారం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో గ్రామీణ యువతకు డ్రోన్ పైలెట్ శిక్షణ ఇచ్చారు. డీజీసీఏ అడ్వాన్స్‌డ్ సర్టిఫైడ్ డ్రోన్ల నిర్వహణపై లవ్‌లీ వుడ్ బిజినెస్ ఇన్కూబేటర్ సంస్థ జిల్లాలోని ఆరుగురికి శిక్షణ ఇచ్చారు. అనంతరం డ్రోన్ నడిపే విధానాన్ని తిలకించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. విమానయాన మౌలిక సూత్రాలు, ఏటీసీ విధానం, రేడియో టెలీఫోన్ తోపాటు పలు అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలని డ్రోన్ శిక్షణ తీసుకున్న వారికి సూచించారు. త్వరలో డ్రోన్ పైలెట్లకు డీజీసీఏ లైసెన్సులు జారీ చేయనున్నట్లు వారు తెలిపారు.


