● గిరిజన సంప్రదాయంలో సంబురాలు
● ఏళ్ల నుంచి వస్తున్న
ఆచారానికి తిరిగి జీవం
బొంరాస్‌పేట: ఎన్నో ఏళ్లుగా కనుమరుగైన గిరిజనుల హోలీ సంబురాల్లో భాగమైన ‘దుండ్’ మళ్లీ ఆదరణకు నోచుకుంది. ఈ వేడుక గిరిజన తండాల్లో కొత్తదనాన్ని నింపింది. యువతకు నైతిక విలువలు నేర్పి, ఆడపడచుల్లో ఆనందాన్ని నింపిలే ఈ పండుగ చేస్తుంది. ఇది బంజారా తెగలోని రమావత్ గోత్రం వారు ప్రత్యేకంగా జరుపుకొంటారు. హోలీ పండుగ సందర్భంగా ఉదయం నుంచే గిరిజన ఆచారం ప్రకారం సామూహికంగా చేరి ఇళ్ల ముందట బెల్లం బువ్వతో ప్రసాదం వండుతారు. దాని చుట్టూ యువకులు కోలాటం ఆడుతారు. మరోవైపు తండాపెద్ద యువతులు తీసుకొచ్చిన కుండల్లో ప్రసాదాన్ని వడ్డిస్తారు. అనంతరం తిరిగి నెత్తిన ప్రసాదాన్ని పెట్టుకొని సంతోషంగా ఆడి పాడుతారు. చివరన హోలీ రంగులు చల్లుకొని శుభాకాంక్షలు తెలుపుకొంటారు. పెళ్లికాని యువతీయువకులకు దుండ్ చాలా ప్రత్యేకం.
దుండ్ అంటే?
దుండ్ అంటే లంబాడ మాండలికంలో వెతుకు, శోధించు అని అర్థం. ముఖ్యంగా పెళ్లికాని యువకులను సామాజికీకరణ కోసం ఇలా చేస్తారు. పండుగకు వారం రోజుల ముందే గ్రామపెద్దలు సమావేశమై తండాలో ఉన్న యువకులను లెక్కిస్తారు.
ఐక్యత కోసం
పిల్లవాడి ఆరోగ్యం, దీర్ఘాయుషు కోసం ప్రార్థించడం చేస్తారు. తండాలో సామాజిక ఐక్యతను పెంచడం కోసం చేస్తారు. ప్రతి కుటుంబానికి సంతోషం కలగాలని కోరుకుంటారు. లంబాడా సంస్కృతిని భవిష్యత్తు తరాలకు అందించడం దీని ఉద్దేశం. బెల్లం బువ్వ, అగ్నిని పూజిస్తారు.
తరాల నుంచి వస్తోంది
దుండ్ అనేది తరతరాలుగా వస్తున్న ఒక గిరిజన సంప్రదాయం పండుగ. ఆ రోజు మా యువతను మంచివైపు నడిపించే ముఖ్యమైన ఘట్టం ఇది. ఆడపడుచులు కూడా ఆనందంతో పూజలు చేస్తారు.
– కమ్లీబాయి, బొట్లోనితండా
యువతకు నైతిక విలువలు
ఈ దుండ్ పండుగ గిరిజన ఆచార సంప్రదాయాల మీద పరిశోధన చేస్తూ వారి జీవితంలో మార్పునకు మార్గం వేయడం. అలాగే చెడు వ్యసనాలకు దూరం చేసే వాతావరణం కల్పించడమే ముఖ్య ఉద్దేశం.
– రాథోడ్ నాని, ఉస్మానియా యూనివర్సిటీ
సంస్కృతిని కాపాడాలి
చదువుకున్న యువకుడిగా మా తండాలో దుండ్ సంప్రదాయాన్ని మళ్లీ పరిచయం చేశాను. బంజారాల్లో ఉన్న మునుపటి మంచి సంస్కృతిని కాపాడి, నైతిక విలువలు పెంపొందించాం. తండాకు ప్రత్యేక బంధాన్ని ముడి వేశాం.
– బాలునాయక్, సర్పంచ్, బొట్లోనితండా
రమావత్ గోత్రం అంతటా
మా గిరిజన జాతిలో ప్రజల జీవన విధానాన్ని ప్రతిబింబించే పండుగ. ప్రతి రమావత్ గోత్రంలో ఈ దుండ్ పండుగ చేస్తాం. ముఖ్యంగా పురుషుల జీవితానికి పట్టాభిషేకం లాంటిది ఈ వేడుక.
– రుక్మానాయక్, తండాపెద్ద, బొట్లోనితండా


