డ్రగ్స్ ఫ్రమ్ ఢిల్లీ!
● ఇద్దరు నైజీరియన్లు సహా నలుగురు అరెస్ట్
● రూ.20 లక్షల విలువైన మాదకద్రవ్యాలు సీజ్
● ఓ విదేశీయుడి వద్ద పలు గుర్తింపు కార్డులు స్వాధీనం
సాక్షి, సిటీబ్యూరో: నైజీరియా నుంచి వివిధ రకాలైన వీసాలపై ఉత్తరాదికి వచ్చి... వీటితో పాటు పాస్‌పోర్టు గడువు ముగిసినా అక్రమంగా నివసిస్తూ... డ్రగ్ పెడ్లర్స్‌గా మారిన ఇద్దరిని హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. వీరి నుంచి రూ.20 లక్షల విలువైన 150 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నామని, వీరిలో ఓ నైజీరియన్ వద్ద ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు కార్డులు ఉన్నాయని డీసీపీ వైభవ్ గైక్వాడ్ రంగనాథ్ పేర్కొన్నారు. బషీర్‌బాగ్‌లోని ఓల్డ్ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పూర్తి వివరాలు వెల్లడించారు.
అరెస్టు కావడంతో మకాం మార్చి...
నైజీరియాకు చెందిన ఛిడీ ఇజాయ 2014లో మెడికల్ అటెండెంట్ వీసాపై ఢిల్లీ వచ్చాడు. దీని గడువు అదే ఏడాది పూర్తికాగా... పాస్‌పోర్టు కూడా ఎక్స్‌పైర్ అయింది. నగరానికి వచ్చి తలదాచుకున్న ఇతడు డ్రగ్స్ దందా మొదలెట్టారు. 130 గ్రాముల కొకై న్, 32 గ్రాముల ఎండీఎంఏతో 2019లో గోల్కొండ ఎకై ్సజ్ అధికారులకు చిక్కాడు. ఈ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత తన మకాం ఢిల్లీకి మార్చాడు. గోవాలోనూ డ్రగ్స్ సరఫరా చేస్తూ అరెస్టు అయ్యాడు. నాగేశ్వరన్ పేరుతో పలు గుర్తింపుకార్డులు పొందాడు. డ్రగ్స్ సరఫరా కొనసాగిస్తున్న ఇతడిపై 2024లో అంబర్‌పేట ఠాణాలో కేసు నమోదైనా పోలీసులకు చిక్కలేదు.
టూరిస్ట్‌గా వచ్చి రెస్టారెంట్ పెట్టి...
అదే దేశానికి చెందిన ఒబసీ జేమ్స్ విక్టర్ 2011లో టూరిస్ట్ వీసాపై ముంబై వచ్చాడు. ఇతడి వీసా, పాస్‌పోర్టు రెండూ ఎక్స్‌పైర్ అయిపోయాయి. అక్రమంగా నివసిస్తూ తొలినాళ్లల్లో వస్త్ర వ్యాపారం చేసినా ఆపై ఢిల్లీలో ‘విలియమ్ ఆఫ్రికన్ రెస్టారెంట్’ పేరుతో హోటల్ పెట్టి ఓ యువతినీ వివాహం చేసుకున్నాడు. ఛిడీ ఇజాయ నివసించే భవనంలో నివసిస్తుండటంతో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఇరువురూ కలిసి ఢిల్లీలోనే ఉండే క్రీస్ అనే నైజీరియన్ నుంచి ఎండీఎంఏ సహా డ్రగ్స్ ఖరీదు చేసి సబ్ పెడ్లర్స్‌కు విక్రయిస్తున్నారు. కొన్నిసార్లు నేరుగా వచ్చి, మరికొన్ని సార్లు పార్సిల్ చేసి నగరంలోని సబ్–పెడ్లర్స్, కస్టమర్లకు పంపిస్తున్నారు.
డెలివరీ చేయడానికి వచ్చి...
ఇటీవల నగరం నుంచి ఎండీఎంఏ కోసం వీరికి ఆర్డర్ వచ్చింది. దీంతో సరుకు తీసుకున్న ఇరువురూ డెలివరీ చేయడానికి టోలీచౌకి ప్రాంతానికి వచ్చారు. దీనిపై హెచ్–న్యూకు సమాచారం అందడంతో ఇన్‌స్పెక్టర్ జీఎస్ డానియేల్, ఎస్‌ఐ సి.వెంకట రాములు తమ బృందాలతో రంగంలోకి దిగారు. టోలిచౌకి పోలీసుల సాయంతో ఇరువురినీ అరెస్టు చేసి, డ్రగ్, గుర్తింపుకార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఛిడీ ఇజాయ వద్ద లభించిన గుర్తింపుకార్డులు అసలైనవిగానే ఉన్నాయని, ఇవి ఎలా వచ్చాయనేది ఆరా తీస్తున్నామని డీసీసీ గైక్వాడ్ తెలిపారు. ఈ కేసులో సబ్–పెడ్లర్స్, కస్టమర్లను గుర్తించామని, వారినీ నిందితులుగా చేర్చి గాలిస్తున్నట్లు వివరించారు. నగరంలో మాదకద్రవ్యాల క్రయవిక్రయాల వివరాలు తెలిస్తే 8712661601కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.


