రూ.200 కోట్లతో అభివృద్ధి పనులు
● పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
● ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి
ఇబ్రహీంపట్నం: నియోజకవర్గంలో రూ.200 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఇబ్రహీంపట్నంలో తహసీల్దార్ నూతన కార్యాలయ భవనంతోపాటు, రూ.7.40 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రూ.2.50 కోట్ల డిస్ట్రిక్ మినిరల్ ఫండ్‌తో నూతన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికలలోపు మరో రూ.20 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభిస్తామన్నారు. చెరువు కట్ట సుందరీకరణ, పాత పట్టణంలోకి వచ్చే ప్రధాన రోడ్డును విస్తరించి, సెంట్రల్ లైటింగ్‌కు రూ.50 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. ఎవరి జీవనోపాధి దెబ్బతినకుండా రోడ్డు విస్తరణ పనులు చేస్తామన్నారు. తాను ఎన్నికలప్పుడు హామీలిస్తుంటే కొంతమంది ఎగతాళి చేసారని, ఇప్పుడు అభివృద్ధి చేస్తుంటే జీర్ణించుకోవడం లేదన్నారు. ఇబ్రహీంపట్నం టౌన్‌లో అక్రమంగా ప్రభుత్వ భూమిలో ఓఆర్సీ తెచ్చుకొని వెంచర్ చేసి ప్లాట్లను విక్రయిస్తుంటే, వాటిని ఆపినట్లు వివరించారు. ప్రభుత్వ భూమిని దిగమింగాలని చూసిన వారి నుంచే కొనుగోలుదారులకు డబ్బులిప్పిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్డీఓ అనంతరెడ్డి, తహసీల్దార్ సునీతారెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్‌గౌడ్, ఏసీపీ కేపీవీ రాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, ట్రైనీ అడిషనల్ కలెక్టర్ వీణ, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే సీఎం కప్ టార్చ్ ర్యాలీని ఎమ్మెల్యే ప్రారంభించారు.


