భార్య బలవన్మరణానికి కారణమైన భర్తకు ఐదేళ్లు జైలు
రూ.4 వేల జరిమానా
కందుకూరు: భార్య ఆత్మహత్యకు కారణమైన భర్తకు కోర్టు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.4 వేల జరిమానా విధించింది. ఈ సంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ సీతారామ్ తెలిపిన ప్రకారం.. మండల పరిధిలోని రాచులూరుకు చెందిన(ప్రస్తుతం తిమ్మాపూర్ గ్రామంలో నివాసం) కొంగర కృష్ణ, సంతోష దంపతులు. కృష్ణ మద్యానికి అలవాటై తరచూ భార్యను వేధించేవాడు. ఈక్రమంలో 2013 మార్చి 27న ఉదయం 7 గంటల సమయంలో భార్యను కొట్టడంతో మనస్తాపానికి గురైన ఆమె ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన ఇరుగు పొరుగు వారు ఆమెను చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. 13 ఏళ్లుగా కోర్టులో కేసు ఉండగా శుక్రవారం జిల్లా అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.4వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చాడు. కేసు ముగియడానికి సహకరించిన అప్పటి ఎస్‌ఐలు జి.నాగరాజు, డి.నాగార్జున, సిబ్బంది బి.మహాలక్ష్మి, అనిల్, జి.మహేశ్‌బాబు, సీహెచ్ యాదగిరి, లైజాన్ ఆఫీసర్ టి.వెంకటరమణకు కృతజ్ఞతలు తెలిపారు.
చెట్టును ఢీకొట్టిన కారు
ఇద్దరికి గాయాలు
కేశంపేట: కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన మండల పరిధిలోని పాపిరెడ్డిగూడ శివారులో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన ప్రకారం.. ఆమనగల్లుకు చెందిన వెంకటేశ్, సునీత పనినిమిత్తం షాద్‌నగర్‌కు వచ్చి తిరుగుప్రయాణమయ్యారు. ఈ క్రమంలో పాపిరెడ్డిగూడ శివారులోకి రాగానే కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం షాద్‌నగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
భార్య బలవన్మరణానికి కారణమైన భర్తకు ఐదేళ్లు జైలు


