నిషేధమైనా వదలం!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: నిషేధిత భూములకు రెక్కలొచ్చాయి. తప్పుడు పత్రాలతో విలువైన భూములు పరాధీనం అవుతున్నా పట్టించుకున్న నాథుడు లేడు. అప్పటి వరకు 22 ఏ జాబితాలో ఉన్న భూములు రాత్రికి రాత్రే పట్టా భూములుగా మారుతున్నాయి. రిటైర్డ్ ఉద్యోగుల సంతకాలను ఫోర్జరీ చేసి.. నకిలీ ఓఆర్‌సీ పత్రాలు సృష్టిస్తున్నారు. వక్ఫ్, ఇనాం, జాగీర్దార్, భూదాన్, దేవాదాయశాఖల భూములు అన్యాకాంత్రం అవుతున్నాయి. ఆక్రమించి వాటికి నకిలీ పత్రాలు సృష్టించి వెంచర్లు, విల్లా ప్రాజెక్టులకు అప్పగిస్తున్నారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, హెచ్‌ఎండీఏ, మున్సిపల్ అధికారులు వీరికి పరోక్షంగా సహకరిస్తుండటం వివాదాస్పదమవుతోంది. ఇప్పటికే రూ.వందల కోట్ల విలువైన భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయాయి.
మచ్చుకు కొన్ని ..
● కొంగరకుర్దు ఏ–1 (రావిర్యాల) రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 85,86,88,89లో 584.34 ఎకరాల వక్ఫ్ భూములు ఉన్నాయి. ఇక్కడ ఎకరం రూ.10 కోట్ల నుంచి రూ.12 కోట్ల విలువ చేస్తుంది. 1954 నుంచి ఇప్పటి వరకు పట్టా కాలంలో సయ్యద్ షారాజ్ ఖత్తార్ హుస్సేన్ దర్గా పేరు ఉంది. 2008లో వక్ఫ్ బోర్డు ఓ గెజిట్ కూడా విడుదల చేసింది. ఇప్పటికే 58 ఎకరాలకు తప్పుడు పత్రాలు సృష్టించిన అక్రమార్కులు తాజాగా మరో 110 ఎకరాలను కొల్లగొట్టేందుకు తెరవెనుక పావులు కదుపుతున్నట్లు తెలిసింది. ఇదే రెవెన్యూ పరిధిలోని ఓ అమ్యూజ్‌మెంట్ పార్క్‌కు ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 82/అ/1లో 11.17 ఎకరాల వక్ఫ్ భూ మిని సైతం నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలతో వెంచర్ చేశారు. కలెక్టరేట్‌కు అత్యంత సమీపంలో జరుగుతున్న భూదోపిడీని అడ్డుకున్న వారే లేరు.
● అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తట్టి అన్నారంలో 600పైగా ప్లాట్లు విక్రయించేందుకు ఓ స్థిరాస్తి సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఏడేళ్ల క్రితం రెండెకరాల వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు తహసీల్దార్ కార్యాలయం నుంచి అనుమతి పొందారు. ఆ పక్కనే ఉన్న మరో ఎకరానికి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. ఆర్డీఓ అనంతరెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసి అనుమతి కోసం హెచ్‌ఎండీకు సమర్పించగా అనుమతులు జారీ కావడం విశేషం. ఆరా తీస్తే అసలు విషయం బయటికి వచ్చింది.
● అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారం సర్వే నంబర్ 376లో 220 ఎకరాల్లో శ్రీమిత్ర డెవలపర్స్ గతంలో వెంచర్ చేశారు. ప్రజావసరాల కోసం లక్ష గజాలను కేటాయించారు. కొంతమంది నకిలీ కన్వర్షన్ ప్రొసీడింగ్స్ సృష్టించి ఈ భూములను కొల్లగొట్టారు. విక్రయించేందుకు యత్నించగా గ్రామస్తులు అడ్డుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో నకిలీ ప్రొసీడింగ్‌గా తేలింది.
● మహేశ్వరం మండలం రావిర్యాల రెవెన్యూ సర్వే నంబర్ 354, 355లో 584 ఎకరాల జాగీర్దార్ భూములు ఉన్నాయి. జాగీర్దార్ల వ్యవస్థ రద్దుతో ఆ భూమి ప్రభుత్వాధీనంలోకి వచ్చింది. రెవెన్యూ అధికారులు 22ఎ జాబితాలో చేర్చారు. 2007లో ఇందులోని 172 ఎకరాలు వక్ఫ్‌బోర్డు ఆస్తిగా ప్రకటించారు. ఇదే సమయంలో తాము జాగీర్దార్ వారసులమంటూ కొంతమంది కోర్టును ఆశ్రయించారు. కేసు కోర్టు పరిధిలో ఉండగానే కొంతమంది నకిలీ ప్రొసీడింగ్స్, ఓఆర్సీలు సృష్టించి ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. ఇందుకు రిజిస్ట్రేషన్ అధికారులు సహకరిస్తున్నట్లు ఆరోపణలు లేకపోలేదు.
● ఆదిబట్ల పరిధిలోని ఓ విలువైన భూమి ప్రభుత్వానిదిగా గుర్తించి నిషేధిత జాబితాలో చేర్చారు. ఆ భూమికి నకిలీ ఓఆర్‌సీలు సృష్టించి జాబితా నుంచి తొలగించారు. స్థానిక ఎమ్మెల్యే జోక్యంతో తిరిగి ఆ భూమిని నిషేధిత జాబితాలో చేర్చారు.
● హయత్‌నగర్–ఇంజాపూర్ రోడ్డులోని సర్వే నంబర్ 191లో సర్కారు భూమి ఆక్రమణకు గురవుతోంది. లారీల కొద్ది మట్టిని పోసి, భూమిని కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతున్నా పట్టించుకోవడం లేదు.
● మహేశ్వరం రెవెన్యూ సర్వే నంబర్ 461లో 128 ఎకరాల ప్రభుత్వ భూమిపై కబ్జాదారుల కళ్లుపడ్డాయి. స్వర్గీయ ఇందిరాగాంధీ హయాంలో దీనిలో 19 ఎకరాలను ఓ మాజీ సైనికోద్యోగితో పాటు స్థానిక ఎస్సీలు, కావలోనిబాయి తండా గిరిజనులకు సీలింగ్ పట్టాలు ఇచ్చింది. విలువైన ఈ భూములపై రియల్టర్ల కన్నుపడింది. నకిలీ పత్రాలు సృష్టించి, భూములను విక్రయించేందుకు యత్నిస్తున్నారు.
మొయినాబాద్ మండలం పెద్ద మంగళారం రెవెన్యూ సర్వే నంబర్లు 210,211,212లోని 16 ఎకరాల్లో రాఘవేంద్ర కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ 1986లో వెంచర్ చేసి విక్రయించింది. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన 50 గిరిజన కుటుంబాలు ఈ భూములను కొన్నాయి. విలువైన ఈ భూములపై కన్నేసిన కొంత మంది పెద్దలు గిరిజనులను రాత్రికి రాత్రి బయటికి పంపారు. కరెంట్ నిలిపివేసి, బౌన్సర్లను పెట్టి ఏళ్ల క్రితమే నిర్మించుకున్న ఇళ్లను కూలగొట్టారు.
నిషేధిత భూములకు రెక్కలు
వక్ఫ్, ఇనాం, జాగీర్దార్ భూములకు ఎసరు
నకిలీ పట్టాలు.. ఓఆర్‌సీలు సృష్టించి ఆక్రమణలు
రిటైర్డ్ ఉద్యోగుల సంతకాలతో పత్రాలు తయారీ
విలువైన భూములను కొల్లగొడుతున్న రియల్టర్లు
చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు


