మదర్‌లో అక్రమాలపై విచారణ చేపట్టాలి
● 2015 నుంచి మొదలైన అక్రమాల పర్వం
● నష్టాలను లాభాలుగా చూపించి బ్యాంకు రుణాలు పొందారు
● డెయిరీ ప్లాంట్‌తో సహా, చిల్లింగ్ సెంటర్ల ఆస్తులు తాకట్టులో ఉన్నాయి
● మదర్ డెయిరీ మాజీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్‌రెడ్డి
సాక్షి, యాదాద్రి: నల్లగొండ–రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయ సహకార సంఘం (నార్ముల్ మదర్ డెయిరీ)లో 2015 నుంచి జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ చేయించాలని మదర్ డెయిరీ మాజీ చైర్మన్ గుడిపాటి మధుసూదన్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం చైర్మన్ పదవికి రాజీనామా చేసిన ఆయన శుక్రవారం భువనగిరిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆ వివరాలను మాజీ చైర్మన్ మాటల్లోనే.. తాను 2024లో చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టేనాటికి డెయిరీ రూ.35.15 కోట్ల నష్టాల్లో ఉన్నట్టు జనరల్‌బాడీ తీర్మానంలో చూపించారు. అప్పటికే డెయిరీ ఆస్తులు బ్యాంకుల్లో తాకట్టుపెట్టారు. ఈ ఆస్తులను జప్తు చేస్తారనే భయంతో గత పాలకవర్గం నష్టాలను, లాభాలుగా చూపించి బోగస్ ఆడిట్ రిపోర్టు రూపొందించి రిపోర్ట్‌ను డీసీఓకు పంపారు. అనుమానం వచ్చిన డీసీఓ పాత ఆడిట్ రిపోర్ట్ లెక్కలను బయటకు తీయడంతో అసలు బండారం బయట పడింది. ఏకంగా రూ.10 కోట్లు అవకతవకలు జరిగినట్టు గుర్తించారు.
నష్టాలకు ఆదాయపన్ను కట్టారు
డెయిరీ నష్టాలు ఏటేటా పెరిగిపోతూ రూ.46 కోట్లకు చేరింది. నష్టాలు చూపిస్తే బ్యాంకుల నుంచి రుణాలు పొందడం కష్టమని భావించి డెయిరీ రూ.8.50కోట్లు లాభాల్లో ఉన్నట్టు దానికి ఇన్‌కం టాక్స్ రూ.2.70 కోట్లు కట్టినట్టు రికార్డులు చూపారు. తాను చైర్మన్‌గా ఎన్ని కయ్యే నాటికి డెయిరీ రూ.35 కోట్లు నష్టాల్లో ఉన్నట్టు జనరల్ బాడీ తీర్మానంలో చూపారు. కానీ, అదే తీర్మానంలో రూ.1.84 కోట్లు లాభాల్లో ఉందని, దానికి రూ.45 లక్షలు ఆదాయపన్ను కట్టినట్టు మ రో లెక్క పత్రం తయారు చేశారు. డెయిరీలో ఎండీ అవినీతికి పాలకవర్గంలోని డైరెక్టర్లు మద్దతుగా నిలిచారు. రూల్స్ ప్రకారం పాలు డిస్ట్రిబ్యూటర్లకు అందరికీ ఒకే రేటు ఫిక్స్ చేస్తారు. కానీ, ఎండీ మాత్రం పాలవకర్గం తీర్మానం కాపీని టాంపరింగ్ చేశారు. లీటర్‌కు రూ.2 అదనంగా చెల్లించి నలుగురు డిస్ట్రిబ్యూటర్ల నుంచి ప్రతి నెలా లక్షల సొమ్ము కాజేశారు. విచారణను సైతం తొక్కిపెట్టారు.
ప్రతి నెలా రూ.4 కోట్ల నష్టం
మదర్ డెయిరీ నష్టం నెలకు రూ.4కోట్ల చేరింది. డెయిరీ ఆస్తుల కొనుగోళ్లలో భారీ అక్రమాలు జరిగాయి. 2009లో చిట్యాల చిల్లింగ్ సెంటర్ పరిధిలో కొనుగోలు చేసిన భూముల విలువ అసలు ధర ఎకరా రూ.5.75లక్షలు మాత్రమే. కానీ, డెయిరీ రికార్డుల్లో భూముల విలువ అమాతంగా రూ.16 లక్షలకు పెంచారు. రైతులకు రూ.1.50కోట్లు చెల్లించి, భూముల కొనుగోలు పేరుతో అక్రమంగా రూ.5 కోట్లు కాజేశారు. రూ.35 కోట్లు నష్టాల్లో ఉన్న సంస్థను కాపాడేందుకు చిట్యాల ఆస్తులు అమ్మేందుకు ప్రయత్నిస్తే 295 మంది పాల సంఘాల చైర్మన్‌ల సంతకాలు పెట్టించి కోర్టులో కేసువేశా రు. మళ్లీ ఇప్పుడు అదే భూమిని అమ్ముతామని కొత్త పాలకవర్గం అంటుంది. రైతుల సంస్థను కాపాడడానికి ఎంతదూరమైనా వెళ్లి పోరాటం చేస్తా. నష్టాల్లో ఉన్న డెయిరీని కాపాడేందుకు నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు(ఎన్‌డీడీబీ)తో మదర్ డెయిరీ పాలకవర్గం ఢిల్లీ వెళ్లి ఒప్పందం చేసుకుంది. కానీ, ఎన్‌డీడీబీ ఎంటర్ అయితే డైరక్టర్లు, ఎండీ కృష్ణల ఆదాయానికి గండిపడుతుందని అడ్డుకున్నారు.


