చెక్‌డ్యాంకు చెర
చెక్‌డ్యాం కూల్చేయడంతో సుద్ద గుంతలోకి చేరిన నీరు
ధారూరు: మైనింగ్ మాఫియా అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వ నిధులతో నిర్మించిన చెక్‌డ్యాంలను సైతం అక్రమార్కులు నేలమట్టం చేశారు. అక్రమంగా మైనింగ్ చేపట్టిన ప్రాంతాన్ని ఆదివారం తరిగోపుల సర్పంచ్ అంజిలయ్య గ్రామస్తులతో కలిసి పర్యటించగా విస్తుబోయే అంశాలు దర్శనమిచ్చాయి. కొండాపూర్‌ఖుర్దు–తరిగోపుల మధ్య పీర్ల కత్వపై వ్యవసాయ భూములకు సాగునీరందించేందుకు ప్రభుత్వం చెక్‌డ్యాంను నిర్మించింది. చెక్‌డ్యాం కింద సుద్ద ఉండటంతో మైనింగ్ మాఫియా చెక్‌డ్యాంకు కూల్చేశారు. ఆనవాళ్లు కనబడకుండా జేసీబీతో నేల చదును చేసేసారు. సుద్ద తవ్వి వ్యర్థాలతో నింపేసారు. చెక్‌డ్యాం కూల్చేయడంతో అక్కడున్న నీరంతా పక్కనే ఉన్న సుద్ద గుంతలోకి చేరింది. ఈ గుంతను సైతం పూడ్చేందుకు సుద్ద వ్యర్థాలను వేస్తున్నట్లు గుర్తించారు. సుద్ద తవ్వకాలతో వాగులోకి వ్యర్థాలు చేరి నీరు కలుషితమవుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. తవ్వకాలు, లారీల్లో తరలింపుతో దుమ్మ, ధూళి వ్యాపించి నీరు, పంటలు కలుషితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు సుద్ద మాఫియాను నిలువరించడంలో విఫలమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చెకండ్యాంను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
చెక్‌డ్యాంకు చెర


