
ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతి రాజ్యం!
● చేయి తడిపితేనే ఫైల్ కదిలేది
● ఏసీబీకి పట్టుబడుతున్నా
తీరు మారని వైనం
తాండూరు: ప్రభుత్వ ఆఫీసుల్లో అవినీతి రాజ్యమేలుతోంది. లంచావతారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఓ వైపు ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్నా వీరి ఆగడాలు మాత్రం ఆగడం లేదు. వివిధ పనుల నిమిత్తం తాండూరు రెవెన్యూ డివిజన్ పరిఽధిలోని కార్యాలయాలకు వచ్చే ప్రజలను కొంతమంది ఉద్యోగులు పీక్కు తింటున్నారు. చేయి తడిపితేనే ఫైలు కదిలేది అనే విధంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంతో పాటు తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్, విద్యుత్, ఎకై ్సజ్, మైన్స్, ఆర్‌అండ్‌బీతో పాటు మరికొన్ని ప్రధాన శాఖలు అవినీతిమయంగా మారాయి.
● తాండూరు మున్సిపల్ పరిధిలోని 7వ వార్డుకు చెందిన ఓ పార్టీ నాయకుడు తమ కాలనీలో ఇళ్లు కట్టుకున్న వారికి ఇంటి నంబర్ కేటాయించాలని మున్సిపల్ ఆఫీసులోని సీనియర్ అసిస్టెంట్‌ను రమేశ్‌ను కలిశాడు. ఇందుకు ఆయన ఒక్కో ఇంటికి రూ.6 వేలు ఇవ్వాలంటూ పది ఇళ్లకు రూ.60 వేలు వసూలు చేశాడు. లబ్ధిదారుల నుంచి ఈ మొత్తం ఇప్పించడంతో వారికి ఇంటి నంబర్లు కేటాయించారు. అనంతరం ఇదే నాయకుడు తాను నిర్మించుకున్న రేకుల షెడ్డుకు ఇంటి నంబర్ ఇవ్వాలని కోరగా రమేశ్ రూ.20 వేలు డిమాండ్ చేశాడు. రూ.15 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అన్ని ఆధారాలతో ఏసీబీకి ఫిర్యాదు చేసినా నెల రోజుల పాటు కాలయాపన చేశారని, దీంతో నేరుగా ఐజీకి ఫోన్ చేయడంతో అప్రమత్తమైన జిల్లా అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా సీనియర్ అసిస్టెంట్‌ను పట్టుకున్నారని బాధితుడు తెలిపాడు.
● దాడులు జరుగుతున్న విషయం తెలియడంతో కమిషనర్ విక్రంసింహారెడ్డితో పాటు సిబ్బంది మొత్తం అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. ఆ తర్వాత ఫోన్లు ఆఫ్ చేసుకున్నారు. దీంతో ఈ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉందో తేల్చాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రమేశ్‌ను ఏసీబీకి పట్టించిన వ్యక్తి 2022 డిసెంబర్‌లో తాండూరు సబ్ రిజిస్ట్రార్ జమీరొద్దీన్‌ను సైతం అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టించాడు.
● తాండూరు రెవెన్యూ డివిజన్ కార్యాలయం అవినీతికి కేరాఫ్‌గా మారింది. గతంలో డీఏఓ దానయ్య, సీనియర్ అసిస్టెంట్ మాణిక్‌రావు రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే.
చంపుతామని బెదరిస్తున్నారు..
తాండూరు టౌన్: మున్సిపల్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రమేశ్‌ను ఏసీబీకి పట్టించాననే కక్షతో తనను చంపుతామని బెదిరిస్తున్నారని బాధితుడు ఇర్షాద్ వాపోయాడు. ఈ మేరకు బుధవారం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రమేశ్ తమ్ముడు నాగేశ్‌తో పాటు బాతుల నాగు వ్యక్తి మున్సిపల్ ఆఫీసులో తనను బెదిరించారని తెలిపాడు. వీరినుంచి తనకు ప్రాణహాని ఉందని పేర్కొన్నాడు. ఈ విషయమై సీఐ సంతోష్‌కుమార్‌ను అడగగా సాక్ష్యాధారాలను పరిశీలించి, సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.