
అవినీతి జలగలు!
ఏసీబీకి వరుసగా పట్టుబడుతున్న అధికారులు
● ఆర్‌ఐ మొదలు తహసీల్దార్లు, అదనపు కలెక్టర్ల వరకు
● తరచూ వెలుగు చూస్తున్న ఘటనలు
● అయినా మారని తీరు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: జిల్లా ప్రజలను అవినీతి జలగలు పట్టిపీడిస్తున్నాయి. ఎప్పటికప్పుడు ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకుంటున్నా.. కేసులు నమోదు చేసి జైళ్లకు పంపిస్తున్నా అక్రమార్కుల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ప్రతి పనికి ఓ రేట్ ఫిక్స్ చేసి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆర్థికాభివృద్ధి, తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్న జిల్లా.. అవినీతి కేసుల్లోనూ అదే రికార్డును కొనసాగిస్తోంది. అడ్డదారుల్లో జిల్లాకు రావడం, ఆ తర్వాత ఫోకల్ పోస్టుల్లో తిష్టవేయడం, పెట్టిన పెట్టుబడిని తిరిగి సంపాదించుకునే క్రమంలో ఏసీబీకి పట్టుబడుతుండటం పరిపాటిగా మారింది. పారదర్శకత, అవినీతి నిర్మూలనకు పెద్దపీట వేయాల్సిన ఉన్నతాధికారులు సైతం ఏసీబీ కేసుల్లో పట్టుబడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కలెక్టరేట్‌లోని అదనపు కలెక్టర్, ఇబ్రహీంపట్నం, తలకొండపల్లి తహసీల్దార్ కార్యాలయాల్లో వెలుగు చూసిన అవినీతి చేపల ఘటనను ఇంకా పూర్తిగా మరిచిపోక ముందే తాజాగా ఆమనగల్లు తహసీల్దార్ కార్యాలయంలో మరో రెండు భారీ చేపలు ఏసీబీ వలకు చిక్కడం గమనార్హం.
మచ్చుకు కొన్ని..
పాసుబుక్‌లో జెండర్ సవరణ కోసం జూలై 29న రూ.50 వేలు తీసుకున్న ఆమనగల్లు తహసీల్దార్ లలిత, సర్వేయర్ రవి తాజాగా మరో రూ.లక్ష డిమాండ్ చేసి మంగళవారం ఏసీబీకి చిక్కారు.
నిషేధిత జాబితాలో ఉన్న భూమిని పట్టా భూమిగా మార్చేందుకు రూ.12 లక్షలు డిమాండ్ చేసిన ఘటనలో మే 28న ఇబ్రహీంపట్నం ఆర్‌ఐ కృష్ణను ఏసీబీ అరెస్ట్ చేసింది. తర్వాత 12 గంటల పాటు తహసీల్దార్ ఆఫీసులో తనిఖీలు చేసింది.
గత ఆగస్టులో నిషేధిత జాబితాలోని 14 గుంటల భూ వ్యవహారంలో గుర్రంగూడకు చెందిన బాధితుడు ముత్యంరెడ్డి నుంచి రూ.8 లక్షలు లంచం తీసుకుంటూ అప్పటి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎంవీ భూపాల్‌రెడ్డి సహా సీనియర్ అసిస్టెంట్ మదన్‌మోహన్‌రెడ్డి ఏసీబీకి చిక్కారు.
భూమి పేరు మార్పిడీ వ్యవహారంలో రూ.50 వే లు తీసుకుంటూ జూలై 1న తలకొండపల్లి తహ సీల్దార్ నాగార్జున సహా వీఆర్‌ఏ యాదగిరి పట్టుబడ్డారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
గత మే 31న నెక్నంపూర్‌లోని ఓ నిర్మాణానికి నిరంభ్యంతర పత్రం జారీ కోసం రూ.2.50 లక్షలు డిమాండ్ చేసిన నీటిపారుదలశాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బన్సీలాల్ సహా గండిపేట మండల సర్వేయర్ పి.గణేశ్ అసిస్టెంట్ ఇంజనీర్ కార్తీక్, ఎస్సీ ఆఫీసులోని ఏడబ్ల్యూ సెక్షన్ ఏఈ నిఖేష్‌కుమార్ ఏసీబీ కేసులో అరైస్టె జైలుకు వెళ్లారు.
గొర్రెల పథకం స్కాంలో సంబంధం ఉన్న జిల్లా పశువైద్య శాఖ అధికారి అంజలప్ప సహా అప్పటి భూగర్భ జలవనరులశాఖ అధికారి రఘుపతిరెడ్డి సైతం ఏసీబీ కేసులో అరైస్టె, తర్వాత విడుదలయ్యారు.
గోపన్‌పల్లిలోని ఓ నిర్మాణానికి ట్రాన్స్‌ఫార్మర్, సీటీ మీటర్ జారీ కోసం రూ.50 వేలు డిమాండ్ చేసిన గచ్చిబౌలి ఏడీఈ సతీష్‌ను ఏసీబీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు.
మంచాల మండలంలోని ఓ వెంచర్‌లో రోడ్డుకు అడ్డుగా ఉన్న 11కేవీ, 33 కేవీ లైన్ షిఫ్టిక్ కోసం రూ.18 వేలు లంచంగా తీసుకుంటూ సరూర్‌నగర్ సర్కిల్ ఎలక్ట్రికల్ డీఈ (టెక్నికల్) టి.రామ్మోహన్ ఏడాది క్రితం ఏసీబీకి పట్టుబడ్డారు.