
భలే మంచి బేరం
అమ్మకానికి తుర్కయంజాల్, బాచుపల్లి లేఅవుట్లలో ప్లాట్లు
సాక్షి, సిటీబ్యూరో: ప్రభుత్వ స్థలాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. వివిధ చోట్ల ఉన్న ప్రభుత్వ భూములను వేలం వేసేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) ఏర్పాట్లు చేపట్టింది. గతంలో ఉప్పల్, కోకాపేట్, బుద్వేల్, హయత్‌నగర్, బోడుప్పల్, బుద్వేల్ తదితర ప్రాంతాల్లో విజయవంతంగా ఆన్‌లైన్ బిడ్డింగ్ నిర్వహించి ప్రభుత్వానికి భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తాజాగా హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలోనే ప్రభుత్వ స్థలాలను విక్రయించేందుకు సర్కార్ పచ్చజెండా ఊపింది. దీంతో పలు ప్రాంతాల్లో హెచ్‌ఎండీఏ లేవుట్లను పూర్తి చేసినప్పటికీ.. వాటిని వేలం వేసేందుకు అధికారులు సర్కార్ ఆమోదం కోసం ఎదురు చూశారు. ఈ మేరకు కొద్ది రోజుల క్రితమే హెచ్‌ఎండీఏ అధికారులు సన్నాహాలు చేపట్టారు. మొద టి విడతగా సెప్టెంబర్ మొదటి వారంలో తుర్కయంజాల్, బాచుపల్లిలోని 82 ప్లాట్లను విక్రయించనున్నారు. ఆ తర్వాత మిగతా స్థలాలను అమ్మకానికి పెట్టనున్నారు. ప్రస్తుతం రియల్ రంగానికి సానుకూలమైన వాతావరణం ఉండడంతో అమ్మకానికి ఇదే అదనుగా భావిస్తున్నట్లు సమాచారం.
అనూహ్య స్పందన
ఇటీవల హౌసింగ్‌బోర్డు నిర్వహించిన ఆన్‌లైన్ బిడ్డింగ్‌కు కొనుగోలుదారుల నుంచి అనూహ్య స్పందన లభించింది. ఈ క్రమంలో హెచ్‌ఎండీఏ స్థలాలకు సైతం మధ్యతరగతి, ఉన్నత ఆదాయవర్గాల నుంచి మంచి స్పందన ఉంటుందని అంచనా వేస్తున్నారు. గతంలో వివిధ చోట్ల నిర్వహించిన బిడ్డింగ్‌కు ఎన్నారైలు భారీ స్పందించారు. కోకాపేట్, బుద్వేల్ వంటి ప్రాంతాల్లో హెచ్‌ఎండీఏ నిర్ణయించిన ధరల కంటే రెట్టింపు ధరల్లో అమ్ముడయ్యాయి. ప్రస్తుతం బైరామల్‌గూడ, కోకాపేట్, చందానగర్, పుప్పాలగూడ, బౌరంపేట్, చెంగిచెర్ల, సూరారంలలో మొత్తం 11 చోట్ల ఉన్న స్థలాలను విక్రయించనున్నట్లు అధికారులు తెలిపారు.
త్వరలో బిడ్డింగ్ నిర్వహించనున్న ప్లాట్‌లు..
లే అవుట్ సర్వే ప్లాట్ల
నంబర్ సంఖ్య
తుర్కయంజాల్ 471/1 12
బాచుపల్లి 39,40 70
దశలవారీగా వేలం నిర్వహించనున్న స్థలాలు
గ్రామం సర్వే చదరపు
నంబర్ గజాలు
బైరామల్‌గూడ 57 2420
కోకాపేట్ 144 8591
చందానగర్ 174 484
పుప్పాలగూడ 146 1400
బాచుపల్లి 363 2299
బౌరంపేట్ 694 2420
బౌరంపేట్ 130 530
బౌరంపేట్ 130 1500
బౌరంపేట్ 130 666
చెంగిచెర్ల 33/1 1210
సూరారం 166/167 4840
రెండు చోట్ల 82 ప్లాట్లు విక్రయానికి సిద్ధం
మరో 11 ప్రాంతాల్లోనూ సన్నాహాలు
దశలవారీగా ఆన్‌లైన్ బిడ్డింగ్‌కు హెచ్‌ఎండీఏ చర్యలు