
ఇంట్లోనుంచి వెళ్లిన బాలుడు.. తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
ఇంట్లోనుంచి వెళ్లిన బాలుడు
తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
ఇబ్రహీంపట్నం: తల్లి మందలించడంతో అలిగి ఇంట్లో నుంచి వెళ్లిన బాలున్ని ఇబ్రహీంపట్నం పోలీసులు క్షేమంగా అప్పగించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. దేవరకొండకు చెందిన విజయకుమారి, హరిష్ దంపతులు అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బ్రాహ్మణపల్లిలో నివాసం ఉంటున్నారు. వీరి కొడుకు తుర్కయంజాల్ కాకతీయ స్కూల్‌లో 5వ తరగతి చదువుతున్నాడు.చిన్న విషయంలో అమ్మ మందలించిందనే కారణంతో ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. తుర్కయంజాల్ నుంచి ఇబ్రహీంపట్నం చెరువు కట్ట వద్ద నడుచుకుంటూ వెళ్తుండగా పోలీసుల కంటపడ్డాడు. అతన్ని ఆరా తీసి, పీఎస్‌కు తీసుకెళ్లి తల్లిదండ్రులను పిలిచి అప్పగించారు.
సాంకేతిక సమస్యలతో తిరుపతి విమానం రద్దు
శంషాబాద్: సాంకేతిక సమస్యలతో తిరుపతి విమానం రద్దు చేశారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి మంగళవారం ఉదయం 5.55 గంటలకు 53 మంది ప్రయాణికులతో అలయన్స్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 91877 విమానం తిరుపతికి బయలుదేరేందుకు సిద్ధమైంది. విమానంలో టేకాఫ్ తీసుకునే ముందు సాంకేతిక సమస్యను గుర్తించిన పైలట్ విమానాన్ని నిలిపివేశారు. కొన్ని గంటల తర్వాత విమానాన్ని రద్దు చేసినట్లు ఎయిర్‌లైన్స్ వర్గాలు ప్రయాణికులకు వెల్లడించారు.
ఘనంగా ఫొటోగ్రఫీ దినోత్సవం
తాండూరు టౌన్: తాండూరు ఫొటో అండ్ వీడియోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈమేరకు స్థానిక వినాయక్ చౌక్‌లో ఫొటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఒక ఫొటో అనేక పాత, మధుర జ్ఞాపకాలను గుర్తుకు తెస్తుందని తెలిపారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్, ఉపాధ్యక్షుడు షాబుద్దీన్, హీరాలాల్, జగదీశ్వర్ పాల్గొన్నారు.