
నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యం
తుర్కయంజాల్: వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడమే బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన ఉద్దేశమని బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ రాజీవ్ మిశ్రా తెలిపారు. భారత ప్రభుత్వం, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం ఆదేశాల మేరకు మంగళవారం పురపాలక సంఘం పరిధి ఇంజాపూర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రామస్థాయి జన సురక్ష కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పేదలు, బలహీన వర్గాలు, అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. అనంతరం పలు మహిళా స్వయం సహాయాక సంఘాలకు రుణాలు పంపిణీ చేశారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఇంజాపూర్ ఉన్నత పాఠశాలకు చెక్కు, సౌండ్ సిస్టం అందజేశారు. కార్యక్రమంలో ఫీల్డ్ జనరల్ మేనేజర్ మనోజ్ కుమార్ శ్రీ వాత్సవ, తెలంగాణ జోనల్ అధికారి ముఖేష్ కుమార్ పాల్గొన్నారు.