
ఆలయాల్లో భారీ చోరీ
● రూ.లక్షకు పైగా నగదు,
కానుకలు ఎత్తుకెళ్లిన దుండగులు
● సీసీ కెమెరాల వైర్లు కట్‌చేసి,
ధ్వంసం చేసిన వైనం
యాలాల: మండలంలోని సంగెంకుర్దు పరిధిలో ఉన్న సంగమేశ్వరాలయం, శనైశ్వరాలయంలో భారీ చోరీ జరిగింది. పక్కపక్కనే ఉన్న ఆలయాల్లోని హుండీలను ధ్వంసం చేసిన దుండగులు పెద్ద మొత్తంలో నగదు ఎత్తుకెళ్లారు. వివరాలు ఇలా ఉన్నాయి.. సంగంకుర్దు శివారులోని కాకరవేణి నది ఒడ్డున సంగమేశ్వరాలయం, దీని పక్కనే శనైశ్వరాలయం ఉంది. ఎప్పటిలాగే ఆలయ పూజారి జగదీశ్ మంగళవారం రాత్రి గేట్లు మూసేసి ఇంటికి వెళ్లాడు. బుధవారం ఉదయం ఆలయం తెరిచేందుకు వెళ్లగా హుండీలు, సీసీ కెమెరాలు ధ్వంసమైనట్లు గుర్తించి, చైర్మన్‌తో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఎస్‌ఐ విఠల్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సంగమేశ్వరాలయ హుండీలో సుమారు రూ.50 వేల నుంచి 60 వేల వరకు నగదు, బహుమతులు, శనైశ్వరాలయంలోని హుండీలో దాదాపు రూ.50 వేల నగదు, భక్తులు వేసిన కానుకలు చోరీకి గురయ్యాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వరుసగా నాలుగో సారి..
సంగమేశ్వరాలయంలో వరుసగా నాలుగోసారి దొంగలు పడ్డారని స్థానికులు తెలిపారు. ఆలయం గ్రామానికి దూరంగా ఉండటంతో ఈ దురాఘతానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆలయ అభివృద్ధికి వినియోగించే భక్తుల డబ్బులు దొంగల పాలవుతున్నాయని తెలిపారు. సీసీ కెమెరాల వైర్లను కట్ చేయడంతో పాటు ధ్వంసం చేసి చోరీలకు పాల్పడటంపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

ఆలయాల్లో భారీ చోరీ