
పోలీసులకు చిక్కిన గ్యాంగ్ రేప్ నిందితుడు
మంచాల: గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని మంచాల పోలీసులు బుధవారం చాకచక్యంగా పట్టుకున్నారు. సీఐ మధు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. గుజరాత్ రాష్ట్రం బచ్చావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2006లో గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన నిందితుడు సికిందర్ రహమతుల్లా 2014 వరకు శిక్ష అనుభవించాడు. 2014లో పెరోల్‌పై బయటకు వచ్చి, పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నాడు. ఇతని కోసం గుజరాత్ పోలీసులు 11 ఏళ్లుగా గాలిస్తున్నారు. సాంకేతిక ఆధారాలతో మంచాల మండలంలోని లింగంపల్లి సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. ఓ కోళ్ల ఫారంలో పనిచేస్తున్న రహమతుల్లాను పట్టుకున్న స్థానిక పోలీసులు గుజరాత్ పోలీసులకు అప్పగించారు.
లాడ్జి గదిలో వ్యక్తి మృతి
కొత్తూరు: లాడ్జి గదిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన కొత్తూరు పట్టణంలో బుధవారం చోటు చేసుకుంది. సీఐ నర్సింహారావు తెలిపిన వివరాల మేరకు.. కేశంపేట మండలం సంగెం గ్రామానికి చెందిన జోగన్నగూడెం రమేశ్(37) ఈ నెల 19న పని ఉందని ఇంట్లో చెప్పి కొత్తూరుకు వచ్చాడు. కొంత కాలంగా ఆయనకు మూర్చా, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. కాగా పట్టణంలోని ఓ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకుని మద్యం తాగాడు. మధ్యరాత్రి లాడ్జి సిబ్బంది గమనించగా పడుకున్న చోటనే రమేశ్ విగతజీవిగా పడి ఉన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య లక్ష్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.