
ఆగని ఆక్రమణలు!
చర్యలు తీసుకుంటాం
● ప్రజా ప్రయోజనార్థం వదిలిన భూములు యథేచ్ఛగా కబ్జా
● రూ.కోట్ల విలువైన స్థలాలు
అన్యాక్రాంతం
● నామమాత్రపు చర్యలతో సరిపెడుతున్న అధికారులు
తుర్కయంజాల్: ప్రజా ప్రయోజనార్థం వదిలిన భూములు పరాధీనం అవుతున్నాయి. అక్రమార్కు లు రెచ్చిపోయి కబ్జాలకు ప్రయత్నిస్తున్నా అధికారుల చర్యలు తూతూ మంత్రంగా ఉంటున్నాయి. స్థానికుల ఫిర్యాదు మేరకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం.. పనులను అడ్డుకోవడం వంటి పనులు చేసి చేతులు దులుపుకొంటున్నారు. కబ్జాదారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడంలో, భూముల చుట్టూ ఫెన్సింగ్ వేయడంలో, వాటిని స్వాధీనం చేసుకోవడంలో ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
హద్దు రాళ్లు నాటుతుండగా..
తుర్కయంజాల్ రెవెన్యూ కమ్మగూడలోని సర్వే నెంబర్లు 227,228లో మను లే అవుట్‌లోని 871 గజాల భూమికి బై నంబర్లు వేసి డాక్యుమెంట్లు చేసిన వ్యక్తులు పలుమార్లు కబ్జాకు ప్రయత్నించారు. బహిరంగ మార్కెట్‌లో రూ.5 కోట్ల విలువైన ఈ భూమి సాగర్ రహదారికి కూతవేటు దూరంలో ఉండడంతో కమర్షియల్ భవన నిర్మాణాలకు అనుకూలంగా ఉంటుంది. దీంతో అధికారులు ఎన్నిసార్లు ఆపడానికి ప్రయత్నించినా కబ్జాదారులు తమ ప్రయత్నాలు విరమించడం లేదు. తాజాగా వరుసగా సెలవులు రావడంతో ఇదే అదనుగా రెండు రోజుల క్రితం ప్లాట్లకు హద్దు రాళ్లను నాటుతుండగా స్థానికుల ఫిర్యాదు మేరకు మున్సిపల్ సిబ్బంది అడ్డుకున్నారు. భవన నిర్మాణ అనుమతి కోసం గతంలో హెచ్‌ఎండీఏకు, మున్సిపాలిటీకి పలుమార్లు దరఖాస్తు చేసిన విచారణ సమయంలో తిరస్కరిస్తూ వచ్చారు. ఇటీవల అధికారులు 400 గజాల ప్లాటుకు అనుమతులు ఇచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
హెచ్చరిక బోర్డుల తొలగింపు
తుర్కయంజాల్ రెవెన్యూ పరిధి రాగన్నగూడలోని సర్వే నంబర్లు 549, 551, 552లో 1984లో 55 ఎకరాల 30 గుంటల విస్తీర్ణంలో శ్రీమిత్ర డెవలపర్స్ వారు వెంచర్‌ను చేసి ప్లాట్లు విక్రయించారు. ఆ సమయంలో ప్రజాప్రయోజనార్థం సుమారు మూడు ఎకరాల ఖాళీ స్థలాన్ని వదిలారు. ఇది హెచ్‌ఎండీఏ, డీటీసీపీ నుంచి అనుమతి వెంచర్ కాకపోవడంతో ఇదే అదునుగా భావించిన కొందరు వ్యక్తులు మరో లే అవుట్‌ను సృష్టించి అమాయకులకు విక్రయించారు. దీనిపై వరుసగా మీడియాలో కథనాలు రావడం, పలువురు స్థానికులు ఫిర్యాదు చేయడంతో అధికారులు నామమాత్రంగా బోర్డులు ఏర్పాటు చేయడం, తరువాత అక్రమార్కులు వాటిని తొలగించడం పరిపాటిగా మారింది. తాజాగా శ్రీశైలం అనే వ్యక్తి 600 గజాల భూమిలో ప్రహరీ నిర్మిస్తుండటంతో మున్సిపల్ అధికారులు అడ్డుకున్నా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మూడు ఎకరాల భూమికి సమీపంలో టీసీఎస్, ఔటర్ రింగ్ రోడ్డు వంటివి ఉండటంతో దీని విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.20 కోట్ల పై మాటే.
4,211 గజాల భూమి ప్లాట్లుగా..
సర్వే నంబర్లు 501, 505,530, 533, 657, 658, 659, 660, 661, 662లోని శ్రీమిత్ర వెంచర్‌లో 9వేల 438 చదరపు గజాల స్థలాన్ని ప్రజా ప్రయోజనార్థం మొదటి లే అవుట్‌లో వదిలారు. ఖరీదైన భూమి కావడంతో అక్రమార్కులు 2013లో మరో లే అవుట్‌ను సృష్టించి కేవలం 2వేల గజాల వరకు ప్రజా ప్రయోజనార్థం వదిలారు. సుమారు 7,700 గజాల భూమిని ప్లాట్లుగా మార్చి విక్రయించారు. దీని విలువ బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ. 15 కోట్ల పైమాటే. ఫిర్యాదులు అందిన ప్రతిసారి అధికారులు బోర్డులు ఏర్పాటుచేయడం అనంతరం తొలగించడం యథావిధిగా మారాయి. ఇవే కాకుండా మున్సిపల్ పరిధిలోని ఇంజాపూర్, మన్నెగూడ, మునగనూర్, తొర్రూర్, కొహెడలోని అనేక పార్కులు, ప్రజా ప్రయోజనార్థం వదిలిన భూములు యథేచ్ఛగా కబ్జాకు గురువుతూనే ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రజా ప్రయోజనార్థం, పార్కుల కోసం వదిలిన భూములను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. కమ్మగూడలోని మను ఎన్‌క్లేవ్‌లోని భూమికి వెంటనే ఫెన్సింగ్ ఏర్పాటు చేసి స్వాధీనం చేసుకుంటాం. శ్రీమిత్ర వెంచర్‌లోని స్థలాలను పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
– కె.అమరేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్

ఆగని ఆక్రమణలు!