
సర్దార్ పాపన్నగౌడ్ సేవలు మరువలేనివి
కడ్తాల్: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పేర్కొన్నారు. మండల పరిధిలోని ముద్వీన్‌లో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆదివారం వారు అవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి మాట్లాడుతూ.. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం సర్దార్ పాపన్నగౌడ్ చేసిన సేవలు మరువలేనివని, తెలంగాణ వీరత్వానికి ప్రతీక అంటూ కొనియాడారు. ప్రభుత్వం అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తోందని, అన్ని కులవృత్తులను ప్రోత్సహిస్తోందని గుర్తుచేశారు. అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహనీయుడు సర్వాయి పాపన్న గౌడ్ అని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాంక్‌బండ్‌పై పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ట్యాంక్‌బండ్‌పై సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహ ఏర్పాటుకు స్థలంతో పాటు రూ.3 కోట్లు మంజూరు చేసిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి, మార్కెట్ చైర్ పర్సన్ యాటగీత, జైగౌడ్ ఉద్యమ జాతీయ అధ్యక్షుడు రామారావుగౌడ్, బీసీ పొలిటికల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బాలరాజుగౌడ్, పీసీసీ సభ్యుడు శ్రీనివాస్‌గౌడ్, టాస్క్ సీఓఓ రాఘవేందర్‌రెడ్డి, పీసీబీ మెంబర్ బాలాజీసింగ్, బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దుర్గయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.