
దండిగా.. నిండుగా..
సాక్షి, సిటీబ్యూరో: నగరానికి తాగునీరు అందించే ప్రధాన జలాశయాలు నాగార్జున సాగర్, గోదావరితో పాటు మంజీరా, సింగూర్, ఉస్మాన్‌సాగర్, హిమయాత్ సాగర్ జలాశయాల్లో దండిగా నీరు చేరింది. ఇటీవల భారీ వర్షాల నేపథ్యంలో ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతుండటంతో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటున్నాయి. దీంతో వచ్చే ఏడాది వేసవి వరకు తాగునీటి తరలింపునకు ఎలాంటి కొరత లేకుండాపోయింది.
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా..
మహా నగరానికి నాగార్జున సాగర్, గోదావరి నుంచే సుమారు 75 శాతానిపైగా తాగునీటి సరఫరా ఉంటుంది. కృష్ణా తాగునీటి సరఫరా పథకం 1, 2, 3 దశల కింద నాగార్జున సాగర్ జలాశయం నుంచి అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా రోజువారీగా 270 ఎంజీడీల నీటిని తరలిస్తుండగా, గోదావరి నీటి సరఫరా పథకం కింద శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 168 ఎంజీడీలు సరఫరా జరుగుతోంది. సింగూర్ నుంచి 75 ఎంజీడీలు, మంజీరా నుంచి 45 ఎంజీడీలు, ఉస్మాన్ సాగర్, హిమాయత్‌సాగర్ నుంచి 40 ఎంజీడీల నీటిని శుద్ధి చేసి సరఫరా చేస్తున్నారు. మరోవైపు గోదావరి మూడు, నాలుగో దశ, మంజీరా అదనపు పైపులైన్ ఏర్పాట్లకు జలమండలి సన్నహాలు చేస్తోంది. పెరుగుతున్న నగర జనాభాకు అనుగుణంగా నీటిని సరఫరా చేసేందుకు అదనపు జలాల తరలింపునకు ఏర్పాట్లు చేస్తోంది.
పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువలో..
నాగార్జున సాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువవుతోంది. ఎగువన కురిసిన వర్షాలకు కృష్ణా నది పరీవాహక ప్రాంతంలోని ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున వరద పోటెత్తి నాగార్జున సాగర్ జలాశయం నిండకుండలా మారింది. శ్రీపాద ఎల్లంపల్లి జలాశయం పూర్తి నీటి మట్టానికి రెండున్నర అడుగులు దూరంలో ఉంది. ఎగువ ప్రాంతం కడెం ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ ప్రాజెక్టు నీటిని నగరంలోని కీలక ప్రాంతమైన ఐటీ కారిడార్ పరిధిలోకి వచ్చే.. మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, లింగంపల్లి, మియాపూర్, చందానగర్, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, కుత్బుల్లాపూర్, అల్వాల్, మల్కాజిగిరి తదితర ప్రాంతాలకు గోదావరి జలాలు సరఫరా జరుగుతోంది.
నాగార్జున సాగర్
నీళ్లతో ప్రధాన జలాశయాలు కళకళ
రానున్న వేసవి వరకు నగర తాగునీటికి బేఫికర్
మరోవైపు గోదావరి 3, 4 ఫేజ్‌లు, మంజీరా రెండో దశ
అదనపు జలాల తరలింపునకు జలమండలి ఏర్పాట్లు
జంట జలాశయాలకు వరద ప్రవాహం
జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్‌లకు వరద ప్రవాహం అధికమైంది. హిమాయత్ జలాశయం పూర్తి నీటిమట్టం చెరువవుతుండటంతో గేట్లు ఎత్తి దిగువన నీటిని విడుదల చేస్తు న్నారు. ఉస్మాన్ సాగర్ జలాశయంంలోకి కూడా వరద ప్రవాహం పెరిగింది. జంట జలాశయాల పరీవాహక ప్రాంతాలైన చేవెళ్ల, వికారాబాద్, శంకరపల్లి, ముమాన్‌పల్లి, దోబీపేట్ చేవెళ్ల, అందాపూర్, కొత్వాల్ పేట్, నర్కూడ, తాండూరు, మొయినా బాద్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసి వరద నీటి ప్రవాహం మూసీ, ఈసీల ద్వారా జలాశయాలలోకి చేరుతోంది. మరోవైపు మంజీరా, సింగూర్ ప్రాజెక్టులకు కూడా వరద ప్రవాహం జోరుగా సాగుతోంది. భారీగా వరద వచ్చి చేరుతుండటంతో గేట్లు ఎత్తి దిగువ వదులుతున్నారు. మొత్తానికి వచ్చే వేసవి నాటికి నగర దాహార్తి తీరేందుకు ఎటువంటి ఢోకా ఉండదు.